వీళ్లు డాక్టర్లా లేకపోతే గల్లీలల్లో తిరిగే ఆవారాగాళ్లా? పేషెంట్ ఉన్న రూంలో బంధువులు ఎవలన్న మాట్లాడుతనే పేషెంట్ కు డిస్టర్బ్ అయితుందని బైటికి పంపించే డాక్టర్లు .. ఆపరేషన్ థియేటర్లో బండబూతులు తిట్టుకుని కొట్టుకునేంత పని చేశారు. ప్రాణాలు కాపాడాల్సినవారే వీధి రౌడీల్లా ప్రవర్తించారు. డాక్టర్ల బుద్దిలేని ప్రవర్తనకి పసి ప్రాణం గాలిలో కలిసి పోయింది.
రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఉమైద్ హాస్పిటల్ లో ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు ఆపరేషన్ చెయ్యాల్సిన డాక్టర్లు కొట్లాటకు దిగారు. ఆపరేషన్ కు ముందు పేషెంట్ ఏమైనా తిన్నదా అన్న విషయంపై గొడవ మొదలైంది. నేను ఆపరేషన్ చేస్తాని ఒకడు, కాదు నేనే చేస్తాని అని ఒకడు తగవుపడ్డారు. మత్తు మందు విషయంలో కూడా ఇద్దరి మధ్య మాటలు హద్దులు దాటాయి. ‘నువ్వెంత?’ అంటే ‘నువ్వెంత ’ అని బూతులు తిట్టుకున్నారు. పురిటి నొప్పులు పడుతున్న మహిళను వదిలేసి గొడవ పడ్డారు. ఆపరేషన్ ఆలస్యం కావడంతో ఆ తర్వాత ప్రసవించిన బిడ్డ మరణించింది. డాక్టర్ల గొడవతో ప్రపంచాన్ని చూడాల్సిన పసికందు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ మొత్తం ఘటనను ఆపరేషన్ థియేటర్ లోనే ఉన్న ఓ నర్సు తన మొబైల్ లో వీడియో తీసింది. ఈ వీడియో చూసిన వారందరూ మందికి సుద్దులు జెప్పే డాక్టర్లే గిట్ల జేస్తె ఎట్ల? పాపం 9 నెలల బిడ్డను మోసిన ఆ తల్లి కడుపుకోతకు ఎవరు సమాధానం చెప్తారు? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. నిర్లక్ష్యంతో పసికందు ప్రాణాలు పోవడానికి కారణమైన ఆ ఇద్దరు డాక్టర్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన్రు. .