doctors of Continental Hospital made a statement on the death of Superstar Krishna
mictv telugu

సూపర్‌స్టార్ కృష్ణ మరణానికి కారణమిదే: డాక్టర్లు

November 15, 2022

సూపర్‌స్టార్‌ కృష్ణ మృతిపై కాంటినెంటల్‌ ఆసుపత్రి డాక్టర్లు ప్రకటన చేశారు. నిన్న ఉదయం కార్డియాక్‌ అరెస్ట్‌తో సోమవారం ఉదయం కాంటినెంటల్‌ ఆసుపత్రికి వచ్చారని డాక్టర్‌ గురు ఎన్‌ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత ఆయనకు ఐసీయూలో ఉంచి చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘గుండెపోటుతో ఆస్పత్రికి వచ్చిన ఆయన్ను వెంటనే ఎమర్జెన్సీకి తరలించి సీపీఆర్‌ చేశాం. ఆ తర్వాత చికిత్స చేయడం ప్రారంభించాం. వచ్చినప్పటి నుంచే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రెండు,మూడు గంటల తర్వాత పలు అవయవాలు పనిచేయడం మానేశాయి.

సుమారు నాలుగు గంటల తర్వాత డయాలసిస్‌ అవసరం ఏర్పడంతో అది కూడా చేశాం. సోమవారం సాయంత్రం కృష్ణ ఆరోగ్యం మరింత విషమించింది. ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదని డాక్టర్ల బృందం నిర్ధారణకు వచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉన్న కొద్ది గంటలు మనఃశాంతిగా వెళ్లిపోవాలని కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. మంగళవారం తెల్లవారుజామున 4.09 నిమిషాలకు కృష్ణ తుది శ్వాస విడిచారు.’’ అని డాక్టర్‌ గురు తెలిపారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు డాక్టర్‌ గురు. ఆయన కుటుంబమంతా గత తొమ్మిదేళ్లుగా కాంటినెంటల్‌ ఆసుపత్రిలోనే వైద్య సేవలు పొందుతున్నారని, కృష్ణకు వైద్య సేవలు అందించినందుకు గర్వపడుతున్నామని చెప్పారు.