పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో డాక్టర్ల నిర్వాకం బయటపడింది. ఆరేళ్ల క్రితం డెలివరి కోసం వెళ్లిన ఓ మహిళకు ఆపరేషన్ చేసిన ఓ డాక్టర్ .. బిడ్డను తీసి కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయారు. కడుపులో కత్తి ఉంచి అలాగే కుట్లు వేశారు. అప్పటి నుంచి బాధితురాలు కడుపునొప్పితో బాధపడుతుంది. ఎంతకు తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లిన బాధితురాలికి విస్తుపోయే విషయాలు తెలిశాయి. స్కానింగ్ రిపోర్టులో కడుపులో కత్తి ఉన్నట్లు తెలియడంతో ఆ మహిళ అవాక్కైయింది.
వివరాలు.. మంచిర్యాలకు చెందిన ఓ మహిళ మొదటికాన్పు కోసం గోదావరిఖనిలోని తన పుట్టింటికి వచ్చింది. నొప్పులు వస్తుంటే కుటుంబ సభ్యులతో కలిసి స్థానిక మార్కండేయ కాలనీలోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంకు వెళ్లింది. డాక్టర్ అబ్జర్వేషన్లో ఉండాలనడంతో 2017 ఏప్రిల్ 15న ఆస్పత్రిలో చేరింది. మరుసటిరోజు సీనియర్ గైనకాలజిస్టు సిజేరియన్ ద్వారా మగబిడ్డకు పురుడు పోశారు. సిజేరియన్ చేస్తున్న సమయంలోనే మహిళ కడుపులో కత్తెర మరిచిపోయి కుట్లు వేశారు. అనంతరం వారం తర్వాత ఆస్పత్రినుంచి ఇంటికి పంపేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కుటుంబంతో ఉంటున్న సదరు మహిళకు మొదటి కాన్పు జరిగి ఆరేళ్లయినా గర్భం అందలేదు.
కడుపునొప్పితోపాటు తరుచూ అనారోగ్య సమస్యలు తలెత్తుండడంతో.. రెండురోజుల క్రితం హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చూపించుకుంది. అక్కడి డాక్టర్ ఎక్స్‌రే తీయించుకోమని సూచించారు. ఆసమయంలోనే కత్తెర ఉందన్న విషయం ఆ మహిళకు తెలిసింది. బాధితురాలికి జరిగిన దారుణంపై కుటుంబ సభ్యులు సిజేరియన్ చేసిన గైనకాలజిస్టును నిలదీశారు. రాజీ కుదుర్చురోవాలని వైద్యురాలు వేడుకున్నారు. బాధితురాలి కడుపులో కత్తెర తీసేందుకు చేసే శస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును తానే భరించడంతోపాటుగా రూ.3.50లక్షలు చెల్లిస్తానని చెప్పడంతో అందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అయితే ఈ విషయం బయటకు తెలియడంతో వెంటనే డబ్బులిచ్చి ఆ మహిళను హైదరాబాద్‌కు తరలించినట్లు తెలిసింది. దీనిపై వైద్యురాలిని వివరణ అడగగా..ఆపరేషన్ సమయంలో పొరబాటు జరిగి ఉండొచ్చని సమాధానం చెప్పారు.