చిన్నప్పుడు మనలో చాలా మంది సుద్దముక్కలు, మట్టి, గోడకేసిన సున్నం తినడం వంటివి చేస్తుంటారు. అయితే పెద్దయ్యాక ఈ అలవాటును మానుకుంటారు. లేదంటే చిన్నప్పుడే పేరెంట్సో, టీచర్లో దండించి మానిపిస్తుంటారు. కానీ, చైనాకు చెందిన 14 ఏళ్ల బాలికకు ఇవన్నీ కాక తన జుట్టును తానే తినే వింత అలవాటు ఉంది.
దీన్ని ఎవరూ గుర్తించకపోవడంతో ఇన్నేళ్లు కంటిన్యూ అవుతూ వచ్చింది. చివరికి ఆహారం తీసుకోనంత దారుణ పరిస్థితి నెలకొనడంతో ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షించగా, కడుపు నిండా వెంట్రుకలే ఉన్నట్టు వెల్లడైంది. ఆహారం తీసుకోవడానికి ఆహార నాళం కూడా ఖాళీగా లేదని గుర్తించి సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి మూడు కిలోల వెంట్రులకు బయటికి తీశారు. బాలిక తల్లిదండ్రులు ఉద్యోగ రీత్యా దూరంగా ఉండడంతో బాలిక అమ్మమ్మ, తాతయ్యల వద్ద పెరిగింది. దీంతో వారు ఈ అలవాటును గుర్తించలేకపోయారు. పికా అనే డిజార్డర్ ఉన్న పిల్లలు బలపాలు, కాగితాలు తింటారని, కానీ వెంట్రుకలు తింటున్న ఈ బాలికకు అరుదైన రాంపూజ్ సిండ్రోమ్ వ్యాధి ఉందని తెలిపారు. ఇది ట్రైకోఫాగియా అనే మానసిక రుగ్మత వల్ల వస్తుందని వెల్లడించారు.