శిశువు చనిపోయిందని కవర్లో చుట్టిచ్చిన వైద్యులు.. కదలడంతో.. - MicTv.in - Telugu News
mictv telugu

శిశువు చనిపోయిందని కవర్లో చుట్టిచ్చిన వైద్యులు.. కదలడంతో..

June 27, 2020

Bhadrachalam

అప్పుడే పుట్టిన బిడ్డ చనిపోయిందని ఓ ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఇచ్చారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. దీంతో ఆ తల్లి తన బిడ్డను పురిట్లోనే పోగొట్టుకున్నానని కన్నీరు మున్నీరు అయింది. అయితే చనిపోయాడని చెప్పిన ఆ శిశువు కాసేపటికే కదలటంతో కన్నతల్లికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత పనైంది. వెంటనే బిడ్డను తీసుకుని ఆసుపత్రికి పరుగులు తీసింది. ఈ దారుణ ఘటన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఏపీలోని తూర్పు గోదావరికి చెందిన సునీత అనే గర్భిణికి ఆరు నెలలు నిండగానే పురిటినొప్పులు వచ్చాయి. దీంతో ఆమెను ఆమె కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె కడుపులో కవల పిల్లలు ఉన్నారనీ.. వారి ఆరోగ్య పరిస్థితి ఏమీ బాగాలేదనీ, వెంటనే అబార్షన్ చేయకపోతే తల్లి ప్రాణానికి ప్రమాదమని చెప్పారు. దీంతో గర్భిణి బంధువులు వేరే దారిలేక అబార్షన్ చేయమని చెప్పారు. అబార్సన్ చేసిన డాక్టర్లు ఇద్దరు పిల్లల్ని బయటకు తీశారు. బయటకు తీసిన ఇద్దరు పిల్లలు చనిపోయారని చెప్పి.. ఓ ప్లాస్టిక్ కవర్‌లో వారిని చుట్టి ఇచ్చారు.

దీంతో గర్భిణి బంధువులు దుఖ్ఖిస్తూ ఆ కవర్ పట్టుకుని బయలుదేరారు. అలా వెళ్తుండగా దారిలో కవర్‌లో ఉన్న కవల పిల్లల్లో మగశిశువు కదలడంతో వారు షాకయ్యారు. వెంటనే తండ్రి ఆ కవర్ పట్టుకుని తిరిగి ఆసుపత్రికి వచ్చాడు. వెంటనే డాక్టర్లు బాబుకు చికిత్స ప్రారంభించారు. కాగా, వైద్యుల నిర్లక్ష్యంపై గర్భిణి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు చెప్పింది నమ్మి తాము బతికి ఉన్న తమ బిడ్డను చేతులారా పాతి పెట్టి చంపేసేవాళ్లం కదా అని మండిపడ్డారు. కనీసం పిల్లలను పరీక్షించకుండా అలా ఎలా చనిపోయారని చెప్తారని ప్రశ్నించారు.