అమీర్‌పేటలో పిచ్చికుక్కల బీభత్సం.. 50 మందికి గాయాలు - MicTv.in - Telugu News
mictv telugu

అమీర్‌పేటలో పిచ్చికుక్కల బీభత్సం.. 50 మందికి గాయాలు

January 21, 2020

Dog Bite.

హైదరాబాద్‌లో వీధి కుక్కలు దడ పుట్టిస్తున్నాయి. అమీర్‌పేటలో ఈ రోజు కొన్ని పిచ్చి కుక్కలు స్వైరవిహారం చేశాయి. కనిపించిన వాళ్లనల్లా కరిచేశాయి. స్కూళ్ల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థులపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.  దాదాపు 50 మంది విద్యార్థులు, స్థానికులు గాయపడ్డారు. వారిని నల్లకుంట ఫీవర్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంత మందిపై ఒక్కసారిగా కుక్కులు దాడికి దిగడం కలకలం రేపింది.ఎప్పుడు ఎవరిపై అవి దాడి చేస్తాయో అని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

ధరమ్‌కరమ్‌ రోడ్డులో ప్రభుత్వ పాఠశాల నుంచి తిరిగి వస్తున్న విద్యార్థులపైకి కుక్కలు దూసుకు వచ్చాయి. ఒక్కసారిగా అవి మీదకు రావడంతో  వారంతా ఒకరిపై ఒకరు పడిపోయారు. ఈ క్రమంలో పిచ్చికుక్కలు వారి కరుస్తూ, గోళ్లతో గాయపరిచాయి. వెంటనే అక్కడున్న వారు వాటిని కొట్టి చంపేశారు. విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. చాలా రోజులుగా తమ ప్రాంతంలో కుక్కలు ఇబ్బందులు పెడుతున్నాయని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ పిల్లలను ఒంటరిగా స్కూలుకు పంపాలంటేనే భయం వేస్తోందని ఆవేదన చెందుతున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని కోరుతున్నారు.