జంతువుల్లో మానవత్వం!అనాథ కోతిపిల్లను పోలీసులకు అప్పగించిన కుక్కపిల్ల  - MicTv.in - Telugu News
mictv telugu

జంతువుల్లో మానవత్వం!అనాథ కోతిపిల్లను పోలీసులకు అప్పగించిన కుక్కపిల్ల 

October 25, 2019

తోటి మనిషి ఆపదలో ఉంటే మనకెందుకులే అని వదిలేసే సమాజం మనది. ఎదుటి వారు రోడ్డు ప్రమాదాల్లో రక్తమోడుతూ ఆపదలో ఉంటే సెల్ఫీలు, వీడియోలు తీసుకోవడంతోనే సరిపెడతాం. మానవత్వాన్ని చాలా మంది మర్చిపోయిన ఈ రోజుల్లో జంతువుల తమలో ఉన్న మంచిని ప్రతి క్షణం బయటపెడుతూనే ఉన్నాయి. జాతి వైరాన్ని మరిచి మరి సాయం చేసుకుంటూ మనుషులకు నీతిని బోధిస్తున్నాయి. తాజాగా తప్పిపోయిన ఓ కోతిపిల్లను ఓ కుక్క తన వీపుపై ఎక్కించుకొని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో అప్పగించింది. ఈ ఘటన అక్కడున్నవారందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. 

మధ్యప్రదేశ్‌లోని రెహ్లీ పోలీస్‌స్టేషన్ పరిధిలో తప్పిపోయిన ఓ కోతి పిల్ల చెరువు ప్రాంతంలో కుక్క కనిపెట్టింది. ఒంటరిగా ఉన్న దాన్నిచూసి చలించిపోయిన ఆ కుక్క దాన్ని తన తల్లి దగ్గరకు చేర్చేందుకు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించింది. దాన్ని అతి కష్టం మీద తన వీపుపై పడుకోబెట్టుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కోతిపిల్ల కూడా దానిపై నమ్మకంతో గట్టిగా పట్టుకొని తల్లి కోసం ఆరాటపడటం ఈ వీడియోలో రికార్డు అయింది. తెలిసో తెలియకో.. పోలీసులు సమస్యను తీర్చుతారని భావించిన కుక్క తెలివిగా వారికి అప్పగించింది. 

దీన్ని చూసిన పోలీసులు తల్లి కోతిని కొంత మంది తరిమివేయడంతో కోతిపిల్ల తప్పిపోయినట్టు గుర్తించారు. వారు ఆ వానరానికి అరటిపళ్లు అందించి ఆకలిని తీర్చారు. కుక్క చేసిన పనికి అంతా ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మూగజీవి అయినా తోటి జీవికి సాయం చేయాలనే లక్ష్యంతో తెలివిగా ఆలోచించిన ఆ కుక్కపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి వాటిని చూసి మనుషులు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు.