మనుషులకే కానీ.. మరెక్కడా కుల ప్రస్తావన రాదు. అలాంటిది ఒక కుక్క పేరు మీద కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు రావడం అధికారులను అవాక్కయేలా చేసింది. అదెక్కడో.., ఆ సంఘటన గురించి తెలుసుకోవాల్సేందే! భారతదేశంలోనే వింత విషయాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందులో ఈ మధ్య బీహార్ లో జరిగింది. బీహార్ ప్రభుత్వం జనవరి 7 నుంచి రాష్ట్రంలో కుల ఆధారిత సర్వేను ప్రారంభించింది. జనవరి 21 నాటికి ముగించింది. అయితే ఈ సమయంలో అధికారులు రాష్ట్రం నుంచి కుల ధృవీకరణ కోసం దరఖాస్తుల కోసం చాలా అభ్యర్థనలను పొందారు. అందులో గయా నుంచి ఒక కుక్క కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం ఇక్కడ విశేషం.
ఈ అభ్యర్థనల్లో..
అధికారులకు వచ్చిన అన్ని దరఖాస్తులను గమనించడం ప్రారంభించారు. అందులో ఒక అభ్యర్థన వద్ద అందరూ ఆగిపోయారు, అవాక్కయ్యారు. అంతేకాదు.. ఆ కుక్క పేరు మీద ఆధార్ కార్డ్ ను కూడా జత చేశారు. ఆ కుక్క పేరు ‘టామీ’ అని అప్లికేషన్ నింపారు. టామీ ఆధార్ మీద తల్లిదండ్రుల పేర్లు షేరు, గిన్నిగా నమోదు అయింది. వృత్తి కింద.. విద్యార్థిగా జత చేశారు. కుక్క పాస్ పోర్ట్ సైజు ఫోటో, క్యూఆర్ కోడ్ తో పాటు నిర్దిష్ట ఆధార్ నంబర్ స్టాంప్ ఉంది. కార్డ్ చూస్తే కూడా అది సరైనదని భావించేలా ఉంది. కానీ దీని వెనుక ఎవరో ఉన్నారని అధికారులు భావించారు.
వైరల్ గా..
ఈ అభ్యర్థనకు సంబంధించి ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో వైరల్ గా మారింది. కుక్క కుల ధృవీకరణ పత్రంతో ఏం చేస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. చాలామందికి కుక్క ఆధార్ నంబర్ చూసి అనుమానం వచ్చింది. ఈ దిశగానే స్థానిక పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆ ఆధార్ రాజబాబు అనే వ్యక్తి నంబర్ గా తెలిసింది. అయితే ఆ కుక్కకి సంబంధించిన వార్త గురించి అతనికేమీ తెలియదని సర్కిల్ అధికారి సంజీవ్ కుమార్ త్రివేది తెలిపారు. ఈ చిలిపి పని చేసిన వ్యక్తి గురించి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆ అప్లికేషన్ రద్దు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.