ఈ కుక్క మనసు మారిపోయింది.. - MicTv.in - Telugu News
mictv telugu

ఈ కుక్క మనసు మారిపోయింది..

October 20, 2017

‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ పద్యం మనకు తెలిసిందే. అయితే  ‘జాగిలాలయందు ఈ లూలూ జాగిలం వేరయా’.. అని పద్యం చెప్పేవాడు ప్రజాకవి వేమన ఇప్పుడు బతికి ఉండి ఈ కుక్కపిల్లను చూసి ఉంటే.

అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ వద్ద ఉందీ ఆడ నల్ల లాబ్రడార్ కుక్క. పేరు లూలూ.  మందుపాతర్లను, నేరగాళ్లను పసిగట్టే జాగిలంలా మార్చడానికి దీనికి కొన్ని నెలలుగా కఠోర శిక్షణ ఇస్తున్నాయి. అయితే ఇటీవల దీని ప్రవర్తనలో పెద్ద మార్పు వచ్చింది. మందుగుండును, రక్తాన్ని వాసన చూడ్డానికి ససేమిరా అంటోంది. ఎంచక్కా తనకు శిక్షణ శిస్తున్న మహిళతో ఆడుకుంటూ గారాలు పోతోంది. దాని మనసును..  మళ్లీ మందుపాతర్లవైపు, రక్తం, చెమట, వంటి నానా కంపువైపు మళ్లించడానికి పోలీసులు తీవ్ర యత్నాలు చేశారు. లేత మేక మాంసం ముక్కలు, కమ్మని పాలు వంటి తాయిలాలు ఆశ చూపారు. మంచి మంచి బొమ్మలు కూడా ముందుపెట్టారు. అయినా అది ఆ లంచాలకు లొంగిపోలేదు. ‘ఇవీ వొద్దు.. ఆ పాడు మందుగుండు వాసనలూ వద్దు.. భౌభౌ’ అని అరుస్తోంది.

దీంతో ఇక చేసేదేమీ లేక పోలీసులు లూలూను దానికి శిక్షణ ఇస్తున్న మహిళ ఇంటికే పంపేశారు శాశ్వతంగా. అదిప్పుడు  తన యజమానురాలి ఇంట్లో హాయిగా ఆడుకుంటోంది. తోటలో ఉడతలను, కుందేళ్ల జాడ పసిగట్టి వాటితో స్నేహం చేస్తోంది. ‘లూలూకు ఇదే సరైంది. దాని నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. ఆల్ ద బెస్ట్ లూలూ’ అని సీఐఏ సోషల్ మీడియాలో చెప్పింది.