కుక్క కావాలి.. లేకపోతే బతకలేం! - MicTv.in - Telugu News
mictv telugu

కుక్క కావాలి.. లేకపోతే బతకలేం!

December 8, 2017

కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదంటారు. ఇది మనుషులకే కాదు మూగజీవులకూ వర్తిస్తుంది. కన్నబిడ్డకంటే ప్రాణంగా పెంచుకున్న వీధికుక్క కోసం ఓ కుటుంబం నిద్రాహారాలు మాని వెతుకుతోంది. ‘సాయి.. సాయి.. నువ్వెక్కడరా? నువ్వు లేకుండా మేం బతకలేమురా నాయనా.. ’ అని రోదిస్తోంది.

హైదరాబాద్‌లో వీరి గాథ అందరినీ కలచివేస్తోంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ గంగేశ్వర్‌రావు కుటుంబం.. తమ కుక్క కోసం పోలీసులను ఆశ్రయించింది. గంగేశ్వర్ తొమ్మిదేళ్ల నుంచి ఒక ఊరకుక్కను పెంచుకుంటున్నాడు. దానికి సాయి అని పేరు పెట్టి గారాబం చేస్తున్నారు. అయితే దాని అరుపులపై పొరుగువారు అభ్యంతరం తెలిపారు. గొడవలు మొదలయ్యాయి.దీంతో దాన్ని చంపేస్తారనే భయతో గంగేశ్వర్.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బ్లూక్రాస్‌ కార్యాలయంలో ఇవ్వాలని అనుకున్నాడు. కారులో హైదరాబాద్‌కు వచ్చి అక్కడికి వెళ్లాడు. అయితే అలాంటి కుక్కలను తాము తీసుకోమని బ్లూ క్రాస్ చెప్పింది. దీంతో ఏం చేయాలో తోచక సాయిని అక్కడే రోడ్డుపైన వదిలేసి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక చాలా బాధపడ్డాడు. అతని భార్య, ఇద్దరు కూతుళ్లు దిగులుతో మూడు రోజులుగా అన్నం కూడా తినలేదు. భోరున విలపిస్తున్నారు. సాయి లేకుండా బతకలేమని అర్థమైంది. అందరూ కలసి బుధవారం కారులో జూబ్లీహిల్స్ వచ్చారు. కుక్క వదిలేసిన 36వ నంబరు రోడ్డులో, చుట్టుపక్కగా గాలించారు. కానీ సాయి ఆచూకీ లేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. అక్కడి కెమరాల్లో సాయి కనిపిస్తాడనే వాటిని శోధిస్తున్నారు.