కరోనా రోగులను గుర్తించేందుకు ఇప్పటి వరకు ధర్మల్ స్కీనింగ్లు, స్వాబ్ పరీక్షలు చేసేవారు. ఫిన్లాండ్లో కొత్త తరహా విధానాన్ని ప్రవేశపెట్టారు. కుక్కలను మోహరించి వాటి ద్వారా కరోనా ఉన్నవారిని గుర్తించే ఏర్పాటు చేశారు. వైరస్ లక్షణాలు ఉన్న వ్యక్తిని వాసన చూసి అవి కనిపెడుతున్నాయి. ఆ దేశ విమానాశ్రయంలో ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా జాగిలాలను రంగంలోకి దించారు.
రోగులను గుర్తించేందుకు సులువైన పద్దతిలో భాగంగా దీన్ని ప్రవేశపెట్టారు. నాలుగునెలల పాటు స్మెల్ డిటెక్షన్ అసోసియేషన్తో శిక్షణ ఇప్పించారు. ప్రయోగాత్మకంగా ఎయిర్ పోర్టులో వీటిని మోహరించారు. దీంతో బుధవారం నుంచి కరోనా ప్రయాణికులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యాయి. ఇది అన్నింటికన్నా సులువైన పద్దతి అని అక్కడి అధికారులు చెబుతున్నారు. జాగిలం గుర్తించిన వ్యక్తికి వెంటనే పీసీఆర్ టెస్టులు చేయనున్నారు. ఇలా మొత్తం నాలుగు జాగిలాలు డ్యూటీ నిర్వహిస్తున్నాయి. కాగా, యూఏఈ తర్వాత వీటిని ఉపయోగిస్తున్న రెండో దేశంగా ఫిన్ లాండ్ రికార్డు సాధించింది.