మనుషులను ఆకర్షించడానికి  కానుకలు తెస్తున్న డాల్ఫిన్లు.. - MicTv.in - Telugu News
mictv telugu

మనుషులను ఆకర్షించడానికి  కానుకలు తెస్తున్న డాల్ఫిన్లు..

May 23, 2020

Dolphins Give Gift to Humans

ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు మూతబడ్డాయి. పర్యటనలు, విహారయాత్రలపై ఆంక్షలు ఉండటంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. కానీ ఈ విషయం తెలియని డాల్ఫిన్లు తమను చూడటానికి ఎవరూ రాడం లేదని బాధపడిపోతున్నాయట. ఇంత కాలం వరకు కోలాహలంగా ఉన్న తమ ప్రాంతంలో ఒంటరిగా మారిపోయామని దిగాలుగా ఉన్నాయట. అందుకే తిరిగి మనుషులను ఆకర్షించడానికి  కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నాయి.

దీని కోసం సముద్రం నుంచి ప్రత్యేకమైన బహుమతులు ఒడ్డుకు మోసుకువస్తున్నాయి. అవి మనుషులకు ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటున్నాయి. ఆస్ట్రేలియా క్వీన్స్ ల్యాండ్ లోని టిన్ కెన్ బేలో ఉన్న బ్రాంక్ లెన్స్ కేఫ్ అండ్ డాల్ఫిన్ ఫీడింగ్ కేంద్రంలో ఇది జరిగింది.  లాక్‌డౌన్ ముందు వరకు పర్యాటకులతో కళకళలాడేది. సందర్శకులు డాల్ఫిన్స్ కోసం ఆహారం తెచ్చే వారు. కానీ ఇప్పుడు రాకపోవడంతో తినడానికి ఏమి లభించడం లేదు. దీంతో అవి తిరిగి మనుషులను ఆకర్షించడానికి బహుమతులు తెచ్చి ఇస్తున్నాయి. వాటి సంరక్షణ చూసుకుంటున్న వాలంటీర్లు వాటిని తీసుకొని ప్రతిగా ఆహారం ఇస్తున్నారు. 

ఈ డాల్ఫిన్స్ తెస్తున్న బహుమతులు కూడా అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. సీసలు, పగడాలు, చిన్నచిన్న కలప ముక్కలను బయటకు తెస్తున్నాయి.  మిస్టిక్ అనే 29 ఏళ్ల మగ డాల్ఫిన్ రోజుకు ఒక్కోసారి పది బహమతులు కూడా తన వెంట తెస్తున్నట్టుగా చెబుతున్నారు. వాటిని చూసేందుకు సందర్శకులు రావాలని నిర్వాహకులు కోరుతున్నారు. కాగా డాల్ఫిన్స్ జంతు జాతుల్లో అత్యంత తెలివైనవి. అవి మనుషులతో సులువగా స్నేహం చేస్తుంటాయి.