సామాన్యుడి నెత్తిన మరో ధరల పెంపు పిడుగు పడింది. కొత్త నెల ఆరంభంలోనే ప్రజలకు ఝలక్ తగిలింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మరో సారి గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచేశాయి. ఈసారి అటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు, ఇటు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు రెండూ కూడా పెరిగాయి. దీంతో ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని చెప్పుకోవచ్చు. ఇకపై గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే.. చేతి నుంచి ఎక్కువ డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది.
కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఏకంగా రూ. 350 మేర పెరిగాయి. దీంతో ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ. 2119కు చేరింది. ఇది వరకు దీని రేటు రూ. 1769గా ఉంది. అలాగే కోల్‌కతాలో చూస్తే.. దీని ధర రూ. 1870 నుంచి రూ. 2221కు పెరిగింది. ఇంకా ముంబైలో ఈ గ్యాస్ సిలిండర్ ధర రూ. 1721గా ఉండేది. అయితే ఇప్పుడు దీని రేటు రూ. 2071కు చేరింది. అలాగే చెన్నైలో చూస్తే.. ఈ సిలిండర్ ధర రూ. 2268కు పెరిగింది. ఇది వరకు రూ. 1917గా ఉండేది. డొమెస్టిక్ సిలిండర్ ధర విషయానికి వస్తే.. ఈ సిలిండర్ ధర కూడా పైకి కదిలింది. రూ. 50 మేర పెరిగింది. దీంతో చాలా మందిపై ప్రతికూల ప్రభావం పడబోతోంది. ఎందుకంటే కొత్తగా సిలిండర్ బుక్ చేస్తే.. ఇప్పుడు రూ. 50 ఎక్కువగా చెల్లించుకోవాలి. 14.2 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధరను గమనిస్తే.. ఇప్పుడు ఢిల్లీలో ఈ రేటు రూ. 1103కు చేరింది. ముంబైలో అయితే రూ. 1102కు పెరిగింది. కోల్‌కతాలో అయితే రూ. 1129కు చేరింది. చెన్నైలో సిలిండర్ ధర రూ. 1118కు పెరిగింది.
ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. డొమెస్టిక్ సిలిండర్ ధర పెరగడం 8 నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ఈ రేటు రూ. 1155కు చేరింది. అలాగే ఏపీలో.. ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ఈ రేటు రూ. 1161కు చేరింది. అంటే తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రాలలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. రూ. 1150 చెల్లించుకోవాల్సిందే. ఇది చాలా ఎక్కువని చెప్పుకోవాలి. సిలిండర్ ధర పెరిగినా కూడా సబ్సిడీ రాకపోవడం మరో ప్రతికూల అంశం. గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. ఇప్పుడు సబ్సిడీ ఎత్తి వేశారు.