విదేశాలకు వెళుతూ ఇంటిని జాగ్రత్తగా చూసుకోమన్న యజమానికి ఓ నౌకరు పంగనామాలు పెట్టాడు. ఇంటి తాళాలు సొంతమయ్యాయన్న ఆనందంలో మరో వ్యక్తితో కలసి యజమాని ఇంటి నుంచి రూ.10 కోట్ల విలువైన నగదు, నగలను దొంగిలించాడు. ఢిల్లీలోని పంజాబీ బాఘ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. యజమాని ఫిర్యాదు ప్రకారం.. జూలై 4న తన కుటుంబ సభ్యులతో కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లాడు. వెళ్లే ముందు తన ఇంట్లో గత ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న బీహార్‌కు చెందిన మోహన్‌కుమార్ (26)కు ఇంటి తాళాలు అప్పగించి వెళ్లాడు.
జులై 18న కుమార్ తన ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు యజమానికి మరో సహాయకుడు సమాచారమిచ్చారు. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సీసీటీవీ దృశ్యాలు పరిశీలించారు. అందులో కుమార్ మరో వ్యక్తితో కలిసి సూట్‌కేసు తీసుకుని యజమాని కారులో వెళ్తున్నట్లు కనిపించింది. రెండవ వ్యక్తి కుమార్ దూరపు బంధువుగా గుర్తించారు పోలీసులు. కుమార్ ఆ కారును రమేశ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వదిలి వెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు బిహార్‌కు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు.