నేనే నంబర్ వన్, నా తర్వాతే మోదీ..ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

నేనే నంబర్ వన్, నా తర్వాతే మోదీ..ట్రంప్

February 21, 2020

donald Trump Boasts About Being Number 1 on Facebook

అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నేనే నంబర్ వన్, మోదీ నంబర్ టూ.. ’ అని అన్నారు. ఫేస్‌బుక్ పేజీల్లోని ఫాలోవర్ల ఆధారంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పెద్ద వివరణ కూడా ఇచ్చుకొచ్చారు. భారత  జనాభా దాదాపు 130 కోట్లు కాగా, అమెరికా జనాభా సుమారు 32 కోట్లు. ఫేస్‌బుక్ పేజీలను పరిశీలిస్తే మోదీ ఫాలోవర్లు 4 కోట్ల 40 లక్షల మంది ఉన్నారు, ట్రంప్‌కు 2 కోట్ల 60 లక్షల మంది ఉన్నారు. 

‘మోదీ 1.5 బిలియన్ల మంది భారతీయులకు ప్రాతినిథ్యం వహిస్తున్నందు వల్ల కొంత సానుకూల పరిస్థితి ఉంటుంది.. అయితే నేనే నంబర్ వన్’ అని ట్రంప్ అన్నారు. గురువారం లాస్ వేగాస్‌లో జరిగిన హోప్ ఫర్ ప్రిజనర్స్ గ్రాడ్యుయేషన్ సెర్మనీని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తనను కలిశారని, ఫేస్‌బుక్‌లో నంబర్ వన్ మీరే అని తనతో చెప్పారని అన్నారు. తాను ఫేస్‌బుక్‌లో నంబర్ వన్‌గా ఉన్నందుకు తనను ‘ఫేస్‌బుక్’ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అభినందించారని ట్రంప్ చెప్పారు. ట్విటర్‌లో కూడా నేను నంబర్ వన్ అని ట్రంప్ చెప్పారు. ఆయన ఈ మాటలు చెప్తూ ఉంటే, సభలోనివారంతా నవ్వారు. ‘నేను ప్రధాని మోదీని అభినందించాను. మీకు 150 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నాకు 35 కోట్ల మంది ఉన్నారు. ‘అది మీకు సానుకూల పరిస్థితి’ అని చెప్పాను’ అని ట్రంప్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ దంపతులు ఈ నెల 24, 25 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు.