ట్రంప్ రికార్డు.. మొదటిసారి దేశభక్తి చట్టాన్ని ఉపయోగించి.. - MicTv.in - Telugu News
mictv telugu

ట్రంప్ రికార్డు.. మొదటిసారి దేశభక్తి చట్టాన్ని ఉపయోగించి..

November 30, 2019

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రికార్డు సాధించారు. అమెరికాలో మొట్టమొదటి సారిగా ‘దేశభక్తి చట్టం’ను ఉపయోగించిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రికార్డుల్లోకి ఎక్కారు. టెర్రరిస్టు కార్యకలాపాలకు సంబంధించి ఆదమ్‌ అమీన్‌ హసౌన్, అమెరికా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 50 ఏళ్ల పైబడిన ఆదమ్‌కు 2017లోనే శిక్షాకాలం పూర్తయింది. ఇక జైలు నుంచి విడుదల అవడమే తరువాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని విడుదల చేయలేదు అమెరికా ప్రభుత్వం. ఎలాంటి విచారణ లేకుండానే జీవితాంతం జైల్లో నిర్బంధించేందుకు ‘దేశభక్తి చట్టం’ను ప్రయోగించారు. ఆయన పుట్టిన లెబనాన్‌గానీ, పెరిగిన పాలస్తీనాను ఆక్రమించుకున్న ఇజ్రాయిల్‌గానీ శరణార్థిగా తీసుకునేందుకు తిరస్కరించడంతో పాటు, జాతీయ భద్రతా దృష్ట్యా ఆయన్ని దేశభక్తి చట్టంలోని 412 సెక్షన్‌ కింద నిర్బంధించారు.

అక్రమ వలస కేసులో జన్మతా లెబనాన్‌కు చెందిన ఆదమ్‌ను మొదటిసారి 2002, జూన్‌ నెలలో అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత టెర్రరిజానికి వ్యతిరేకంగా అమెరికా యుద్ధం ప్రకటించాక ఎక్కువ సార్లు ఆదమ్‌ జైలులోను ఉన్నారు. ఆయన  ప్రత్యక్షంగా టెర్రరిస్టు కార్యకలాపాల్లో పాల్గొనలేదు. కానీ టెర్రరిస్టు కార్యకలాపాలకు మద్దతిస్తున్న పలు ముస్లిం చారిటీ సంస్థలకు భారీగా విరాళాలు తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఈ చారిటీ సంస్థలను కూడా అమెరికా నిషేధించింది. 2017లో ఆదమ్‌ శిక్షాకాలం పూర్తయినా.. దేశభక్తి చట్టాన్ని ఉపయోగించారు. ఈ చట్టం కేవలం విదేశీయులకే వర్తిస్తుంది. ఈ చట్టాన్ని అమెరికాపై ఒసామా బిన్‌ లాడెన్‌ జరిపించిన వైమానిక దాడుల అనంతరం 2001, అక్టోబర్‌ 26వ తేదీనుంచి అమెరికా పార్లమెంట్‌ ఆమలులోకి తీసుకువచ్చింది.