Donald Trump launches 2024 US presidential run, getting jump on rivals
mictv telugu

రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తున్నా.. ట్రంప్ కీలక ప్రకటన

November 16, 2022

2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ప్రకటించారు. రిపబ్లిక్, డెమొక్రాట్ పార్టీ నుంచి అధికారికంగా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన తొలి వ్యక్తిగా డొనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఫ్లోరిడాలోని తన విలాసవంతమైన మార్-ఎ-లాగో నివాసంలో ట్రంప్ వందలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. యూఎస్ ఫెడరల్ ఎలక్షన్ కమిషన్ వద్ద ట్రంప్ తరఫున గతంలో ఆయన రాజకీయ సంస్థ కోసం పనిచేసిన బ్రాడ్లీ క్రేట్ కీలక పత్రాలను దాఖలు చేశారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ జె ట్రంప్ పోటీచేస్తారని అందులో పేర్కొన్నారు.

అమెరికా పునరాగమనం ఇప్పుడే ప్రారంభం అయిందని తన మద్దతుదారులతో డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. అమెరికాను మళ్లీ గొప్పగా మరియు అద్భుతంగా మార్చడానికి, యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడిగా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తున్నానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇప్పటికీ అమెరికాలో అత్యంత ప్రజాధరణ కలిగిన నేతగా డొనాల్డ్ ట్రంప్ ఉన్నారు. గత వారం ఆయన మాట్లాడుతూ..తన అధ్యక్ష అభ్యర్థిత్వంపై త్వరలోనే ప్రకటన చేస్తానని చెప్పారు. తాజాగా ఆయన బుధవారం తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఈ రోజు మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన రోజులలో ఒకటిగా మారతుందని ఆశిస్తున్నానని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్రూత్ సోషల్ లో పేర్కొన్నారు.