బాగ్దాది వారసుణ్ణి కూడా మట్టుబెట్టాం..ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

బాగ్దాది వారసుణ్ణి కూడా మట్టుబెట్టాం..ట్రంప్

October 29, 2019

ప్రపంచశాంతికి ప్రమాదకరంగా మారిన ఐసిస్ ఉగ్రవాద సంస్థ పట్ల అగ్రరాజ్యం అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. శనివారం ఐసిస్ అగ్రనేత అబుబకర్-అల్-బాగ్దాదీని అమెరికా దళాలు మట్టుబెట్టిన సంగతి తెల్సిందే. బాగ్దాదీని తమ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి చంపినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఈ క్రమంలో బాగ్దాదీ స్థానాన్ని భర్తీ చేయబోయే ఉగ్రవాదిని కూడా అమెరికా దళాలు హతమార్చినట్లు ట్రంప్ ప్రకటించారు.

మంగళవారం ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. ఐసిస్ అగ్రనేత స్థానాన్ని భర్తీ చేయబోయిన ఉగ్రవాది పేరును మాత్రం ప్రకటించలేదు. ఇరాక్‌కు చెందిన ప్రొఫెసర్ అబ్దుల్లా కార్దాష్‌నే బాగ్దాదీ వారసుడని విదేశీ మీడియా వెల్లడించింది. ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సైన్యంలో అబ్దుల్లా కమాండర్ స్థాయిలో వ్యవహరించాడని నిర్ధారించింది. సద్దాం హుస్సేన్ మరణించిన తరువాత అబ్దుల్లా ప్రొఫెసర్‌గా స్థిరపడినట్లు ధృవీకరించింది. బాగ్దాదీ స్థానాన్ని అబ్దుల్లానే భర్తీ చేస్తాడని నిఘా వర్గాల సమాచారం మేరకు ఆయన్ను మట్టుబెట్టినట్లు సమాచారం. మూడు రోజుల వ్యవధిలోనే ఐసిస్ అగ్రనేత స్థానాన్ని భర్తీ చేయబోయే ఉగ్రవాదిని మట్టుబెట్టామని ట్రంప్ ప్రకటించడం అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా దళాలు వరుసగా ఐసిస్ అగ్ర ఉగ్రవాదులను హతమార్చడం పట్ల ఉగ్రవాద బాధిత దేశాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.