అగ్రరాజ్యం అమెరికాలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. రోజుకు వేల ప్రాణాలను హరిస్తోంది. స్పెయిన్, ఇటలీని మించి అక్కడ మరణాలు నమోదయ్యాయి. త్వరలో అక్కడ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థ తలకిందులు అవుతుందనే భావనతో ట్రంప్ లాక్డౌన్ విధించడంలో తత్సారం వహించారనే ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికి అక్కడ 11 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 67 వేలకు పైగా మృతిచెందారు. ఇలాంటి పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ కరోనా మరణాల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అన్నారు.
కరోనా మహమ్మారి కారణంగా తాము 75 వేల నుంచి 1 లక్ష మంది వరకు పౌరులను కోల్పోతామనిపిస్తోందని వ్యాఖ్యానించారు. తలుచుకుంటేనే భయమేస్తోందని వాపోయారు. కాగా, గతంలో ఆయన అమెరికాలో కరోనా మరణాల సంఖ్య 70 వేల వరకు చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.