Don't call me Reddy: Minister Amarnath
mictv telugu

దయచేసి నన్ను ‘రెడ్డి’ని చేయవద్దు : ఏపీ మంత్రి

August 13, 2022

ఏపీ మంత్రి గుడివాడ అమరనాథ్ శుక్రవారం అధికారులకు కీలక సూచన చేశారు. తన పేరు వెనుక రెడ్డి అనే పదం లేదని, దయచేసి ఆ పదం చేర్చి నన్ను ఇబ్బంది పెట్టవద్దని కోరారు. కొంతమంది అవగాహన లేకుండా తనను అలా పిలిచి రెడ్డిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహ్వానం పలికేవారికి సరైన సమాచారం లేకుండా పేరు వెనుక రెడ్డి తగిలిస్తున్నారని వాపోయారు. తిరుపతిలోని అపాచీ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఈవో, జపాన్ ప్రతినిధులు తనను అమరనాథ్ రెడ్డిగానే సంబోధించారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలోని ప్రత్యేక ఆర్ధిక మండలిలో నెలకొల్పే టైర్ల కంపెనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 16న వస్తున్నారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అధికారులతో పై వ్యాఖ్యలు చేశారు. అలాగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజలను తరలించాలని, కుర్చీలు ఖాళీగా కనిపించకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కాగా, అనకాపల్లి నియోజవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అమరనాథ్.. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి దక్కించుకున్నారు.