'Don't come on the road when the rain subsides'.. police advice to Hyderabad People
mictv telugu

హైదరాబాదీలు రోడ్లపైకి రావొద్దు.. పోలీసుల సూచన

July 22, 2022

వారం రోజుల పాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వాన ఓ మూడ్రోజులు బ్రేక్ తీసుకుని మళ్లీ ఈ రోజు స్టార్ట్ చేసినట్లుంది. ఇవాళ తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌ నగరంలో వర్షం కురుస్తోంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, ఎల్బీనగర్, వనస్థలిపురం, పనామా, అబ్దుల్లాపూర్‌మెట్, నాంపల్లి, సికింద్రాబాద్, చాంద్రాయణగుట్ట, పాతబస్తీ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాచారం, మల్లాపూర్, ఈసీఐఎల్, చర్లపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కూకట్‌పల్లిలో వంటి పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటం వల్ల స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు వెళ్లేవారు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు వరద నీటిలోనే సతమతమైన లోతట్టు ప్రాంత వాసులు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.

నేడు, రేపు హైదరాబాద్‌ నగరానికి భారీ వర్షసూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్‌ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం ఆగిన వెంటనే రోడ్లపైకి రావొద్దని సూచించారు. ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే వారితో పాటు వ్యాపారాలు చేసుకునే వాళ్లు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రాకుండా గంట తర్వాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్లపైకి చేరిన నీరు బయటకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయే అవకాశముంటుందని ట్రాఫిక్‌ పోలీసులు సూచించారు.