Don't come out from Home: GHMC warns people of Hyderabad over heavy rains
mictv telugu

ఇంట్లో నుంచి బయటకు రావొద్దు.. హైదరాబాదీలకు హెచ్చరిక

June 28, 2022

Don't come out from Home: GHMC warns people of Hyderabad over heavy rains

హైదరాబాద్‌ నగరంలో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని హెచ్చరించింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో డీఆర్‌ఎఫ్‌ బృందాలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తంగా ఉంచింది. ఇవాళ మధ్యాహ్నం నుంచి కురుస్తున్న మోస్తరు వర్షాలతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. సికింద్రాబాద్, అల్వాల్‌, నెరేడ్‌మెట్‌ తదితర ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని జీహెచ్‌ఎంసీ పేర్కొంది. ఈ క్రమంలో అనవసరంగా బయట తిరిగి ఇబ్బందులకు గురి కావద్దని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు. వర్షాలకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఎదురైతే GHMC ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రం నెంబర్ 040-21111111ను సంప్రదించాలని కోరారు.

మరో వైపు రాష్ట్రంలో అక్కడక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు పడమర ద్రోణి ఉత్తర మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మీదుగా ..దక్షిణ ఒడిశా తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి సుమారు 900మీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.