ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల టాప్ టెన్ జాబితాలో ఉండే దేశం నెదర్లాండ్. ఆ దేశ రాజధాని అమ్స్టర్డ్యామ్ నగరం ఎంతో అద్భుతంగా ఉంటుంది. కాలువలు, మ్యూజియంలు, సుందరమైన వీధులతో అలరారే ఈ భూతల స్వర్గాన్ని చూసేందుకు పర్యాటకులు విపరీత ఆసక్తి చూపిస్తారు. అయితే పై వాటితో పాటు పాపపు సిటీగా కూడా పేరు గాంచింది. ఎందుకంటే ఆ నగరంలో వ్యభిచారం, డ్రగ్స్ తీసుకోవడం చట్టబద్ధం. దీంతో పర్యాటకులే కాదు, అమ్మాయిల కోసం, డ్రగ్స్ కోసం వచ్చేవాళ్లు పెరిగిపోయారు. ఎంతలా అంటే వీరి వల్ల అక్కడ జీవన వ్యయం భారీగా పెరిగిపోయేంత. అక్కడికెళ్లిన ఇలాంటి వాళ్లు అక్కడే తిష్ట వేసి ఉండడంతో నగర జనాభా కంటే ఈ పనుల కోసం వచ్చిన వాళ్ల జనాభానే ఎక్కువయిపోయింది.
అక్కడి హోటళ్లన్నీ అమ్మాయిల పొందుకోసం, మత్తు పదార్ధాల సేవనం కోసం వచ్చిన వాళ్లతో నిండిపోయాయి. ఫలితంగా నిజమైన టూరిస్టులకు అక్కడికి వెళ్లడం అధిక ఖర్చుతో పాటు ఏవగించుకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో నగర మేయర్ ఎమ్కే హల్సేమా ఓ ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నైతికతతో నగర అందాలు చూసేందుకు, సంస్కృతీ సాంప్రదాయాలు తెలుసుకునేందుకు వచ్చే పర్యాటకులకు స్వాగతిస్తాము. కానీ, నైతికత కోల్పోవడానికి మాత్రం దయచేసి ఇక్కడకి రావొద్దు. ఇప్పటికే నగరంలో నాన్ రెసిడెంట్స్ ఎక్కువయ్యారు. దీంతో నగర జీవనం ఖరీదు బాగా పెరిగిపోయింది. సెక్స్, డ్రగ్స్ కోసమే అయితే రావొద్దని మనవి చేస్తున్నా. ఇలాంటివన్నీ మనీలాండరింగ్, వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉన్నాయి’ అని అభిప్రాయపడ్డారు. కాగా, 2018లో మొదటి మహళా మేయర్ అయిన ఎమ్కే.. సెక్స్ వర్కర్ల కోసం ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించారు. దీని ద్వారా వేశ్యా గృహాలను మూసివేయడం లేదా వేరే చోటికి తరలించడం లాంటివి పెద్ద ఎత్తున చేపట్టారు.