ఆలస్యం వద్దు..ఉద్యోగాలను భర్తీ చేయండి: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఆలస్యం వద్దు..ఉద్యోగాలను భర్తీ చేయండి: జగన్

July 5, 2022

ఆంధ్రప్రదేశ్‌లో వైద్య, ఆరోగ్య శాఖలో ఏర్పడిన ఖాళీలను ఆలస్యం చేయకుండా ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయాలని జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మానవ వనరుల కొరతకు ఎలాంటి ఆస్కారం లేకుండా వైద్యానికి సంబంధించిన పోస్టులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ నియామకాల విషయంలో ఉద్యోగుల మరణాలు, ఉద్యోగ విరమణ, వీఆర్‌ఎస్, ఇతర కారణాలతో ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి జగన్ మోహన్ రెడ్డి అత్యవసర అనుమతులు (బ్లాంకెట్‌ పర్మిషన్‌) ఇచ్చారు.

వైద్యశాఖ అధికారులు మాట్లాడుతూ..”ఉద్యోగులు మరణించడం, వీఆర్‌ఎస్, పదవీ విరమణ వంటి కారణాలతో ఏడాది పొడవునా ఏదో ఒక విభాగంలో పోస్టులు ఖాళీ అవుతుంటాయి. ఈ తరహాలో గత ఏడాదికిపైగా కాలంలో ప్రజారోగ్య విభాగంలో 91, డీఎంఈలో 272 అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, 150 అసోసియేట్‌ ప్రొఫెసర్లు, 130 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ అయ్యాయి. వీటికి అదనంగా వందల సంఖ్యలో స్టాఫ్‌ నర్సు, పారామెడికల్, నాన్‌మెడికల్‌ పోస్టుల్లో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ రెండు విభాగాలతోపాటు వైద్య విధాన పరిషత్‌ను కూడా కలుపుకుంటే 2 వేలకు పైగా ఖాళీలు ఏర్పడ్డాయని మా అంచనా. వీటిని భర్తీ చేయాలంటే మొదట ఆర్థిక శాఖ అనుమతులు పొందాలి. అనుమతి వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. కానీ, జగన్ మోహన్ రెడ్డి అత్యవసర అనుమతులు జారీ చేయడం ఖాళీలను భర్తీ చేయడానికి రంగం సిద్దం చేస్తున్నాం” అని అన్నారు.

మరోపక్క అధికారులు ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నారు. ఖాళీలన్నింటిని గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపేపనిలో పడ్డారు. ఆస్పత్రుల్లో మానవవనరుల కొరతకు తావుండకూడదన్న సీఎం ఆశయాన్ని నెరవేర్చడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.