వర్షాకాలంలో ఆకుకూరలు తినొద్దా? ఏంటి సమస్య! - MicTv.in - Telugu News
mictv telugu

వర్షాకాలంలో ఆకుకూరలు తినొద్దా? ఏంటి సమస్య!

August 9, 2019

Don't eat greens during rainy season

వర్షాకాలంలో తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటించాలి. లేదంటే అనారోగ్యాలు దరిజేరతాయి. ముఖ్యంగా మహిళలు తీసుకునే ఆహారంలో తగు జాగ్రత్తలు పాటించాలి. మితంగా ఆహారం తీసుకోవాలి. అతిగా తినడంవల్ల అజీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. వర్షాకాలంలో ఆకుకూరల్లో కలుషితాలు చేరతాయని కనుక వాటిని తగ్గించడం మేలని నిపుణులు చెబుతున్నారు. వాటికి బదులు. కాయధాన్యాలు, కూరగాలయతో చేసిన పులుసులు, సాంబార్, చట్నీలు తీసుకోవాలి.

ఆకుకూరలు వాడితే.. 

 ఆకుకూరల్లో నీరు అధికంగా వుండటం వల్ల జీర్ణశక్తి తగ్గుతుంది. పైగా వాటిపైన క్రిములు ఎక్కువగా వుంటాయి. అందుకని ఆకుకూరలను ఉప్పునీళ్లల్లో బాగా కడుక్కొని తరుక్కోవాలి. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు వీటన్నింటిపైనా బురద, మట్టి, దుమ్మూ పేరుకుని ఉంటాయి. పుదీనీ చట్నీ తీసుకోవాలి. ఉల్లి, వెల్లుల్లితో చేసినవి తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. పులుపు పదార్థాలైన పెరుగు, మజ్జిగలాంటివి తగ్గించడం మంచిది. ఇవి కడుపులో ఆమ్ల మోతాదును పెంచుతాయి. 

మాంసాహారం, చేపలు వంటి వాటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. మొలకలు తినేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈకాలంలో ప్రతి పదిమందిలో ఒకరు ఆహార కాలుష్యం కారణంగా ఆసుపత్రి పాలవుతారు. చికెన్‌ని శుభ్రంగా కడిగి వండాలి. ఉప్పు, పసుపు వేసి పిసికి బాగా కడగాలి. లేదంటే దానిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కడిగేటప్పుడు ఆ నీరు కూడా ఇతర కాయగూరలపై పడకుండా జాగ్రత్త వహించాలి.

నీటిలో దినుసులు నానబెట్టినప్పుడు ఆ తేమకి ఈ కాలంలో ఈకొలి బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. ఈ బ్యాక్టీరియా అనేక అనారోగ్య సమస్యలను తెస్తుంది. అందుకే అజీర్తి సమస్యలు ఉన్నవారు మొలకెత్తిన వాటిని వేయించుకుని తింటే మంచిది. 

ఉడికించిన గుడ్లని పచ్చి గుడ్లతో కలిపి ఉంచకూడదు. సగం ఉడికించిన గుడ్లు కూడా చాలా ప్రమాదకరమైనవి. వీటిలోని సాల్మొనెల్లా బ్యాక్టీరియా కారణంగా వాంతులు, విరోచనాలు అవుతాయి. సలాడ్లను కూడా చాలా శుభ్రంగా తయారు చేసుకోవాలి. వర్షాకాలంలో లిస్టేరియా అనే బ్యాక్టీరియా అతి వేగంగా వృద్ధి చెందుతుంది. దాంతో వాంతులు, విరోచనాలు అవుతాయి. పుట్టగొడుగులూ, బీన్స్‌ వంటివి ఉడకకపోతే అనేక అనారోగ్యాలు వస్తాయి. వాటిని పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.

చేపల్లో ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, పోట్రీన్లు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాకాలంలో బలహీనంగా ఉండే మానవ జీర్ణవ్యవస్థపై ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయి. వర్షాకాలంలో చెరువులు, నదులు ఎక్కువగా కలుషితమవుతాయి. వాటిని తింటే టైఫాయిడ్, జాండీస్, డయేరియా వచ్చే ప్రమాదం వుంది కాబట్టి చేపలు కూడా తినకపోవడం మంచిది.