'Don't encounter..surrender'..board viral
mictv telugu

‘ఎన్‌కౌంటర్ చేయకండి..లొంగిపోతా’..బోర్డు వైరల్

September 13, 2022

‘నేను లొంగిపోతున్నాను. దయచేసి నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు’ అంటూ ఓ హత్య కేసు నిందితుడు మెడలో బోర్డు వేసుకొని పోలీస్ స్టేషన్‌కు వచ్చిన సంఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆ నిందితుడు మెడలో వేసుకున్న ఆ బోర్డు చర్ఛనీయాంశంగా మారింది. అలా ఎందుకు ఆ నిందితుడు లొంగిపోయాడు? అనే దానిపై ఘజియాబాద్‌ పోలీసులు మీడియా ముందు వివరణ ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ ఘటన జరిగింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో నేరగాళ్ల ఎలాంటి నేరాలకు పాల్పడిన వారికి ఎన్‌కౌంటర్లు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలతో ఇప్పటికే చాలా మంది లొంగిపోయారు.

ఈ క్రమంలో తాజాగా ఈ నెల 9న ఘజియాబాద్‌లో ఓ హత్య జరిగింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ, మరొకడు పరారీలో ఉన్నాడు. అయితే, పోలీసుల కళ్లు గప్పి తప్పించుకు తిరుగుతున్న ఆ నిందితుడు సోహైల్‌ను పట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలం కావడంతో ఎస్పీ ఓ ప్రకటన చేశారు.

‘అవసరమైతే నిందితుడిని ఎన్‌కౌంటర్ చేస్తాం. ఈ విషయంలో ప్రభుత్వ ఆదేశాలు కూడా మాతో ఉన్నాయి’ అని హెచ్చరించాడు. అంతే, అది విన్న నిందితుడు సోహైల్ ఎన్‌కౌంటర్ తప్పదని భయపడిపోయాడు. ఇక తప్పించుకుని లాభం లేదని పోలీసులకు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మెడకు ఓ బోర్డు తగిలించుకుని పోలీస్ స్టేషన్‌కు బయలుదేరాడు. ”నేను లొంగిపోతున్నాను. మరోమారు ఇలాంటి నేరాలకు పాల్పడను. నన్ను ఎన్‌కౌంటర్ చేయొద్దు” అని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి, పోలీసులకు లొంగిపోయాడు. దాంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.