Don't kill cow for Bakrid festival: Asom MP badridden ajmal
mictv telugu

మన పూర్వీకులు హిందువులు.. ఆవును వధించొద్దు : ముస్లిం ఎంపీ

July 8, 2022

బక్రీద్ పండుగ రానున్న సందర్భంగా అసోంకు చెందిన లోక్ సభ ఎంపీ, ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన పూర్వీకులు అందరూ కూడా హిందువులే. వారు ఇస్లాంను నమ్మి ముస్లింలుగా మారారు. మన దేశంలో చాలా మంది సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. వారి విశ్వాసాల ప్రకారం ఆవు చాలా పవిత్రమైన జంతువు. వారి మనోభావాలను గౌరవించాలి. ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లింలు ఆవును వధించవద్దు. ఆవు మాంసం తినవద్దు. ఈ పండుగను మేము హిందూ సోదరులతో కలిసి జరుపుకుంటా’మని వెల్లడించారు. ఇంకా ఆరెస్సెస్, నుపుర్ శర్మలపై కూడా ఆయన స్పందించారు. ‘ఆరెస్సెస్ హిందూస్థాన్‌ని హిందూరాజ్యంగా మార్చాలని ప్రయత్నిస్తోంది. వారు హిందూ, ముస్లింల మధ్య ఉన్న ఐక్యతను విచ్ఛిన్నం చేయలేరు. అలాగే మహమ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను ముస్లింలు పట్టించుకోవద్దు. తలలు నరికేస్తామని ప్రకటించడం మూర్ఖత్వం అవుతుంది. దానికి బదులు ఆమెలాంటి వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుడిని కోరుకుందా’మని సూచించారు. కాగా, రాష్ట్రపతి అభ్యర్ధిగా బీజేపీ ప్రతిపాదించిన గిరిజన మహిళా అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు తాను ఓటేస్తానని వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. ఇదిలా ఉండగా, ముస్లిమేతరులు నివసించే ప్రాంతాల్లో గొడ్డు మాంసం లేదా దాని అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలను నిషేధిస్తూ అధికార బీజేపీ ప్రభుత్వం 2021లో చట్టం చేసింది. దానిని అందరూ గౌరవించాలని బద్రుద్దీన్ అజ్మల్ ముస్లింలను కోరారు.