don't peel veggies and fruits-they are healthy
mictv telugu

తోక్కలో బలం…

December 19, 2022

don't peel veggies and fruits-they are healthy

మనలో చాలా మంది తొక్కలోది అనే పదాన్ని వాడుతుంటారు. ఎందుకంటే మనకు తొక్క అంటే అంత చిన్నచూపు. దానికి కారణం మనం తినే కూరగాయలకు కానీ, పళ్ళకు కానీ తినే ముందు తొక్కలు తీసి తింటుంటాం. మనకు అదొక వేస్ట్. ఎందుకూ పనికి రాని వస్తువు. మహా అయితే మొక్కలకు ఎరువుగా పనికి వస్తుంది అంతే. బంగాళదుంపు, బీరకాయ, సొరకాయ పొట్టు తీసేసి వంట చేస్తాం. ఆపిల్‌, ఆరెంజ్‌, కివి‌ లాంటి పళ్ళ తొక్కల్ని నిర్దాక్షిణ్యంగా తీసి పారేస్తాం. తొక్క టేస్ట్‌‌గా ఉండకపోవడం, దానిపై కెమికల్స్‌ ఉంటాయని, త్వరగా అరగదని కారణాలు చెబుతాం కూడా. కానీ మీకో నిజం తెలుసా. మనం వృథా అంటూ పడేసే ఈ తొక్కలలో ఎన్నో పోషకాలు ఉంటాయట. ఈ విషయాన్ని ఆరోగ్య నిపుణులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.

పండ్లతో దొరికే పోషకాలలో 25 నుంచి 30 శాతం తొక్కల్లోనే ఉంటాయంటున్నారు నిపుణులు . కూరగాయలలో ఉండే ఫైబర్‌లో 31 శాతం పొట్టులోనే ఉంటుందిట. నారింజ తొనలలో కంటే.. తొక్కలలోనే విటమిన్‌ సీ రెండు రెట్లు ఎక్కువగా ఉంటుంది. విటమిన్‌ బి6, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్‌ వంటి పోషకాలూ పుష్కలంగా ఉంటాయి. నారింజ తొక్క త్వరగా జీర్ణం కాదు. చేదుగానూ ఉంటుంది. డైరెక్ట్ గా తినలేం కాబట్టి వీటిని కోరుకుని సలాడ్లలో వేసుకోవచ్చు. వాటిని ఎండబెట్టుకొని పొడి చేసుకొని వంటకాల్లో ఉపయోగించడం వల్ల పోషకాలు పూర్తిగా శరీరానికి అందుతాయి.అలాగే పుచ్చకాయ లోపలి గుజ్జును తినేసి..పైన తొక్కను పడేస్తాం. కానీ దీని తొక్కలో సిట్రులిన్‌ అనే అమైనో యాసిడ్‌ ఉంటుంది. కండరాల నొప్పులు తగ్గటానికీ సహాయపడుతుంది. ఇది రక్తంలోంచి నైట్రోజన్‌‌ను తొలగించడానికి సహాయపడుతుంది. పుచ్చకాయ గుజ్జులో కన్నా తొక్కలోనే సిట్రులిన్‌ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తొక్కను కూరగాయల మాదిరిగా వేయించుకొని తినొచ్చు. కావాలంటే పచ్చడీ చేసుకోవచ్చు. ఈ తొక్కతో వడియాలు పెడతారు. పుచ్చకాయ ఉడికించుకొని జామ్‌ కూడా తయారుచేసుకోవచ్చు.

ఇక ఆపిల్ తొక్కతో సహా తింటే..విటమిన్‌ కె 332%, విటమిన్‌ ఎ 142%, విటమిన్‌ సి 115%, క్యాల్షియం 20%, పొటాషియం 19% లభిస్తాయిట. ఫైబర్‌ కూడా అధికంగా లభిస్తుంది. ఇందులో క్వెర్‌సెటిన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ కూడా ఉంటుంది. ఇది బ్రెయిన్‌, లంగ్స్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మామిడిపండు కూడా మనమంతా చెక్కు తీసి ముక్కలు కోసుకుని తింటాం. కానీ పై చెక్కుతో సహా జ్యూస్‌ చేయడం వల్ల మరిన్ని పోషకాలూ, పీచుపదార్థం శరీరానికి అందుతాయని చెబుతున్నారు వైద్యులు. ఇందులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. విటమిన్‌ ఇ, సి, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, కెరొటినాయిడ్లూ అధికంగా ఉంటాయి. ఒమేగా 3, ఒమేగా 6, రెండు రకాల పాలీ అన్‌సాచ్యురేటెడ్‌ ప్యాటీ యాసిడ్స్‌ కూడా ఉంటాయి.

ఇఠప్పడు కూరలు గురించి కూడా చెప్పుకుందాం. చాలా కూరలను తొక్కతో సహానే తింటే మంచిది అంటున్నారు. బీరకాయ లోపలి దానికన్నా తొక్కలోనే పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. రెండూ కలిపి వండుకుని తినగలిగే సరే లేకపోతే తొక్కను వేరేగా పచ్చడి చేసుకుని తినొచ్చు. ఇది రుచిగా కూడా ఉంటుంది అంటున్నారు. అలాగే కీరా దోస ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీన్ని సాధారణంగా తొక్క తీసి తింటు ఉంటారు. దీన్ని పొట్టుతో తింటే.. మరిన్ని పోషకాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. కీరా తొక్కలో.. పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండటానికి, రక్తం గడ్డలు ఏర్పడకుండా చూడటానికి తోడ్పడే విటమిన్‌ కె కూడా అధికంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే సిలికా, జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్‌ కీరాదోసె పొట్టులో పుష్కలంగా ఉంటాయి.

బంగాళాదుంపలు….వీటిని అయితే తొక్కతో ఎవ్వరూ తినరు కచ్చితంగా. మన దేశంలో వీటిని తొక్కతో తినే వారు మహా అయితే ఒక 10 శాతం ఉంటారేమో. కానీ విదేశాలలో దుంపలను సాధారణంగా తొక్కతోనే తింటారు. బంగాళాదుంప లోపల కన్నా.. పొట్టులోనే ఎక్కువ పోషకాలు ఉన్నాయిట. పొట్టు తీసి ఉడికించిన దాని కన్నా పొట్టుతీయకుండా ఉడికించిన బంగాళాదుంపలో విటమిన్‌ సి 175%, పొటాషియం 115%, ఫోలేట్‌ 111%, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ 110% అధికంగా ఉంటాయి. వీటి తొక్కలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్‌ కడుపు నిండిన భావన కలిగేలా చేసి ఆకలిని అదుపులో ఉంచుతుంది దాని వల్ల బరువు తగ్గచ్చు.

ఇవే కాదు సొరకాయ, అరటిపండు లాంటి పళ్ళు, కూరల తొక్కలు కూడా మంచివే అంటున్నారు. మనకు దొరికే కూరగాయలు, పండ్లలలో ఏదీ వేస్ట్ అనేది లేదని అన్నింటినీ తినొచ్చని చెబుతున్నారు. దొరికిన దాన్ని దొరికినట్టుగానే తింటేనే అందులోని ఉన్న పోషకాలు అన్నీ మన శరీరానికి అందుతాయని చెబుతున్నారు.