Don't use volunteers in election process: Election Commissioner Meena
mictv telugu

వాలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించవద్దు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు

September 16, 2022

Don't use volunteers in election process: Election Commissioner Meena

ఏపీలో అక్కడి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఇంటింటికీ సేవలు అందించాలనే ఉద్దేశంతో వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రతీ 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ని నియమించగా, వారికి ప్రభుత్వం రూ. 5 వేలను నెల భత్యంగా చెల్లిస్తుంది. తమ పరిధిలోని కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సేవలు, సంక్షేమ పథకాలను వారు పర్యవేక్షించాల్సి ఉంటుంది.

ఇలా ప్రతీ పనికి ప్రభుత్వం వారి సేవలను వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లో వినియోగించరాదంటూ ఆదేశించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వారితో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధాన ప్రక్రియలో వారిని భాగస్వాములను చేయవద్దని, ఇందుకు సంబంధించి ఎలాంటి పనులను వారికి అప్పగించవద్దని సూచించారు. ప్రభుత్వ వేతనం తీసుకుంటున్నందున వారిని ఈ ప్రక్రియలో అనర్హులుగా తేల్చారు.