మొన్న హైదరాబాద్లో కరోనాతో భర్త చనిపోయాడని భార్య బిల్డింగ్ మీదనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. చావులోనూ భర్త తోడును విడవలేదని స్థానికులు కన్నీరుమున్నీరు అయ్యారు. అలాంటి ఘటనే మరొకటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. ప్రియురాలు అనారోగ్యంతో చనిపోవడాన్ని ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె సమాధి వద్దకు వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవపూర్ మండలంలోని కుదురుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీతాంజలి, మహేశ్లు గాఢంగా ప్రేమించుకున్నారు.
ఒకర్ని విడిచి మరొకరు ఉండలేకపోయారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుని కలకాలం సంతోషంగా ఉందాం అనుకున్నారు. ఇంతలోనే ప్రియురాలు అనారోగ్యంతో చనిపోయింది. దీంతో మహేశ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని ఈ లోకంలో తాను ఉండకూడదని భావించాడు. ఆదివారం నాడు ప్రియురాలి సమాధి వద్దకు వెళ్లిన మహేశ్ ఉరి వేసుకుని మృతిచెందాడు. ఈ ఘటనలతో ఇరు కుటుంబాల్లో తీరని విషాదం అలుముకుంది. వారిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు. బంధువులు, సన్నిహితులు, స్థానికులు రోదిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.