సీఏఏపై మాట్లాడలేదు.. ఢిల్లీ అల్లర్లు భారత్ అంతర్గత విషయం.. ట్రంప్ - MicTv.in - Telugu News
mictv telugu

సీఏఏపై మాట్లాడలేదు.. ఢిల్లీ అల్లర్లు భారత్ అంతర్గత విషయం.. ట్రంప్

February 25, 2020

Donald Trump.

భారత్ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) గురించి ప్రధాని నరేంద్ర మోదీ తనతో మాట్లాడలేదని అన్నారు. మోదీతో సమావేశం అనంతరం మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. ‘మత స్వేచ్ఛపై మేము చర్చించాం. దానికి మేము కట్టుబడి ఉంటామని మోదీ నాకు చెప్పారు. భారత్‌లో అన్ని మతాలను సమానంగా చూస్తున్నారు. ఢిల్లీ అల్లర్లు భారత్ అంతర్గత విషయం. భారత్‌ ఎప్పుడూ శాంతినే కోరుకుంటోంది. భారత్ పర్యటన ఎప్పటికీ మర్చిపోలేం. నాకు అద్భుతమైన ఆతిథ్యం లభించింది. భారత్‌తోనూ, మోదీతోనూ మా మైత్రి బంధం బలపడింది. భారత్‌లో 140 కోట్ల మంది ప్రజల మార్కెట్ ఉంది. భారత్‌తో 3 బిలియన్ డాలర్ల రక్షణ ఒప్పందం చేసుకున్నాం. భారత్‌కు మరిన్ని ఆయుధాలు విక్రయిస్తాం. ఇంధన రంగంలో మా పెట్టుబడులు పెరిగాయి. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెడతాం’ అని ట్రంప్ తెలిపారు. 

అలాగే మోదీతో తాలిబన్ శాంతి ఒప్పందంపై చర్చించామని ట్రంప్ పేర్కొన్నారు. తాలిబన్లతో శాంతి ఒప్పందం భారత్‌కు మేలు చేస్తుందని.. ఉగ్రవాదులపై తమ దాడులు కొనసాగుతాయని వెల్లడించారు. అల్‌ బాగ్దాదీని తామే హతమార్చామని చెప్పారు. ఐసిస్‌కు వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం అవ్వాలని మీడియా వేదికగా పిలుపు ఇచ్చారు.