రూ. 20 మాస్క్ పెట్టుకుంటారా? రూ. 5000 జరిమానా కడతారా?
మాస్కులు ధరించకుండా రోడ్లపై ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని కేరళ పోలీసులు నిర్ణయించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమౌతున్నారు. ఎవరైనా మాస్కు పెట్టుకోకుండా కనిపిస్తే రూ. 5000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాలకు వచ్చినప్పుడు కచ్చితంగా మాస్కు పెట్టుకోవాల్సిందేనని వయనాడ్ ఎస్పీ స్పష్టం చేశారు.
దుకాణాల వద్ద కూడా వ్యాపారాలు కచ్చితంగా శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. లేకపోతే వారికి రూ. 1000 జరిమానా విధిస్తామని అన్నారు. షాపుల్లో పని చేసే సిబ్బంది కూడా విధిగా మాస్కులు పెట్టుకొని, భౌతిక దూరం పాటించాలని ఆదేశించారు. కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరు సహకరిస్తేనే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. మాస్కులు పెట్టుకోకుండా పోలీసులకు పట్టుబడిన వ్యక్తులను కోర్టులో హాజరపరిస్తే దోషిగా నిర్ధారణ అయితే మాత్రం చట్ట ప్రకారం మూడేళ్ళ జైలు శిక్ష, లేదా, రూ.10,000 వరకు జరిమానా ఉంటుందని హెచ్చరించారు. వీటిన్నింటిని గుర్తు పెట్టుకొని బాధ్యతగా నడుచుకోవాలని తెలిపారు.