ఆంధ్రప్రదేశలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అండగా నిలబడుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఆయన ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ‘కౌలు రైతుల భరోసా యాత్ర’ను శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు నుంచి పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబాన్ని మంగళవారం పవన్ కల్యాణ్ పరామర్శించారు. అనంతరం ఆయన భార్య సుజాతకు రూ. లక్ష ఆర్ధికసాయం చెక్కును అందజేశారు. తన భర్త చనిపోయిన తర్వాత ప్రభుత్వం తరఫున లాంటి సాయమూ అందలేదని, ఎవరూ పట్టించుకోలేదని పవన్ వద్ద సుజాత ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..”పార్టీ తరఫున అన్ని రకాలుగా మీ కుటుంబానికి అండగా ఉంటాము. మీరు ఏం బాధపడకండి నేనున్నాను” అని ఆయన ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాకుండా ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామానికి పవన్ చేరుకోనున్నా పవన్.. ఆ తర్వాత అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలకు చేరుకొని, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించనున్నారు.
మరోపక్క ఏయే జిల్లాల్లో ఎంత మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారనే వివరాలను ప్రభుత్వం నుంచి సమాచార హక్కు చట్టం కింద జనసేన సేకరించింది. ఆ ప్రకారమే ఆయా జిల్లాల్లో “ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పవన్ కలుసుకోనున్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి ఎంతోకొంత సాయం చేయాలనే దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నానంటూ.. ఇందుకు తన వంతు సాయంగా ఆయన రూ. 5 కోట్లు పార్టీకి విరాళం ప్రకటించారు. దీనిలో భాగంగా నేడు శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో కాలు రైతుల కుటుంబాలను ఆయన పరామర్శించి ఆర్థికసాయం చేశారు.