హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ వచ్చేశాయి. ఎత్తుగా, రంగురంగుల్లో, ఎంతో అందంగా చక్కర్లు కొడుతున్నాయి. మంగళవారం పురపాలక మంత్రి కేటీఆర్ వీటిని జెండా ఊపి ప్రారంభించారు. ఇవి ఎలక్ట్రిక్ బస్సులు. కేటీఆర్, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి తదితరులు బస్సులో కాసేపు ప్రయాణించారు. ప్రస్తుతం మూడు బస్సులు తీసుకొచ్చామని, మరో మూడు త్వరలో వస్తాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. మొత్తం 20 ఎలక్ర్ట్రిక్ డబుల్ డక్కర్లు సహా 300 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తామని చెప్పారు. డబుల్ డక్కర్ బస్సులను చార్మినార్, గోల్కొండ, హుసేన్ సాగర్ ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు తిప్పుతారు. పేరుకు తగ్గట్టే రెండు లెవల్లలలో సీటింగ్ సదుపాయం ఉంది. టూరిస్టు స్పాట్లను పూర్తిగా చూడ్డానికి కొన్ని బస్సులకు ఓపెన్ టాప్ ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సును రూ. 2.16కోట్లకు కొన్నారు. ఒక్కో బస్సులో డ్రైవర్ సహా 65 మంది కూర్చోవచ్చు. రెండున్నర గంటల్లో చార్జింగ్ పూర్తవుతుంది. ఒకసారి చార్జ్ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.