మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు..! - MicTv.in - Telugu News
mictv telugu

మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు..!

May 25, 2017


డబుల్ డెక్కర్ బస్సులు మళ్లీ రాబోతున్నాయి. ఈ చివరి ఏడాది చివరికల్లా రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఇదేదో హైదరాబాద్ లో కాదు…బెంగళూరు సిటీలో.. బస్సులంటే డబుల్ డెక్కర్ బస్సులే..అందులో ప్రయాణిస్తుంటే ఆ మజాయే వేరు. పట్నం వచ్చిన కొత్తలో సిటీని తనవితీరా చూడాలంటే అందులో ఎక్కేవాళ్లు.ఈ బస్సు కోసం కొందరు గంటలకొద్దీ ఎదురుచూసేవాళ్లు..రాగానే టాప్ లో ఫ్రంట్ సైడ్ విండో సీటు కోసం పరుగులు..రష్ ఎక్కువగా వీటిలో ప్రయాణించడానికే జనం ఆసక్తి చూపేవారు.
1990 వ దశకంలో హైదరాబాద్ లో మూడు, నాలుగు డబుల్ డెక్కర్ బస్సులు నడిచేవి. సికింద్రాబాద్ నుంచి వయా ట్యాంక్ బండ్ మీదుగా మోహిదీపట్నం వరకు ఒకబస్సు నడిచేది. 7జెడ్ పేరిట మరో బస్సు జూ పార్క్ దాకా వెళ్లేది. హైదరాబాద్ కు కొత్తగా వచ్చిన వాళ్లు ఈ బస్సులు ఎక్కి సిటీ అందాల్ని చూసే వారు. రాను రాను ట్రాఫిక్ పెరిగిపోవడం..రోడ్లు ఇబ్బందిగా మారటం, బస్సులు డొక్కుపడటం వల్ల వీటిని తిప్పలేకపోయారు. సిటీ వాసుల్ని అలరించిన డబుల్ డెక్కర్ బస్సులు 2000 సంవత్సరం నాటికి డిపోల్లో తుక్కుగా మారాయి.
ఈ బస్సుల గురించి ఇప్పుడు ఎందుకంటే బెంగళూరులో మళ్లీ రోడ్డెక్కబోతున్నాయి. ఈ ఏడాది చివరికల్లా వీటిని నడిపించాలని బీఎంటీసీ ప్లాన్ చేస్తోంది. తొలుత నాలుగైదు బస్సుల్ని కొంటున్నారు. వీటిని ఏ రూట్లలో తిప్పాలనే దానికి సర్వే చేయించారు. ఈ బస్సుల్ని ప్రత్యేకంగా డిజైన్ చేయిస్తోంది బీఎంటీసీ. 1970 నుంచి 1990 దాకా బెంగళూరు రోడ్లపై డబుల్ డెక్కర్ బస్సులు చక్కర్లు కొట్టేవి. ఆ తర్వాత వీటిని నగరంలోని పర్యాటక కేంద్రాల వీక్షణకే పరిమితం చేశారు. ఆ తర్వాత పూర్తిగా రోడ్లపై తిప్పడమే మానేశారు. ఉన్నట్టుండి మళ్లీ బీఎంటీసీకి డబుల్ డెక్కర్లపై దృష్టి పడింది. ఆలోచన వచ్చిందే తడవుగా చకచకా కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది చివరికల్లా రోడ్డెక్కించాలని తహతహలాడుతోంది. ఇలాగే హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సులు వస్తే ఎంతబాగుండునో…పైన మెట్రో..మధ్యలో డబుల్ డెక్కర్ …కింద సిటీ బస్సు…ఆహా ఊహించుకుంటేనే….ఎలాగో ఉంది కదా..