Double fine for motorists who violate rules in Hyderabad
mictv telugu

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. ఇక నుంచి డబుల్ ఫైన్

September 22, 2022

తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో పదేపదే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతూ, చలాన్లు కట్టని వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక నుంచి రెండింతల ఫైన్లను వసూలు చేయనున్నారు. మూడు నెలల వ్యవధిలో ఫైన్ చెల్లించకుండా కాలయాపన చేస్తూ, అదే పనిగా నియమాలను పాటించని వారిపై కొరడా ఝలిపించనున్నారు. రాంగ్ సైడ్ ప్రయాణం, అక్రమ పార్కింగ్, సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, సోల్ ఫోన్ డ్రైవింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలకు ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు. దాని ప్రకారం జరిమానాల మొత్తం ఇలా ఉండనుంది.

1. వితౌట్ హెల్మెట్ : హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే రూ. 100 జరిమానా, ఈ జరిమానా చెల్లించకుండా మూడు నెలలలోపు మళ్లీ ఉల్లంఘిస్తే రూ. 200, మూడోసారి రూ. 600 జరిమానా చెల్లించాలి.2. రాంగ్ సైడ్ డ్రైవింగ్ : ఆటోలకు రూ. 200, రెండోసారి రూ. 600, మూడోసారి రూ. 800 ఫైన్ విధిస్తారు. తేలికపాటి వాహనాలు, భారీ వెహికిల్స్‌కి మొదటిసారి రూ. 1000, రెండోసారి రూ. 1500, మూడోసారి రూ. 2000 విధిస్తారు.

3. అక్రమ పార్కింగ్ : టూవీలర్లు, ఆటోలకు రూ. 200, రెండోసారి రూ. 700, మూడోసారి రూ. 1000 చెల్లించాలి. స్టేషనుకి తరలిస్తే రూ. 350 విధిస్తారు. తేలికపాటి, భారీ వాహనాలకు రూ. 1000, రెండోసారి రూ. 1200, మూడోసారి రూ. 1700 చొప్పున ఫైన్ కట్టాల్సి ఉంటుంది. వాహనదారుల్లో క్రమశిక్షణను పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలు నివారించడంలో భాగంగా తాజా చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.