రెండు తలల కప్పలు చూశాం, రెండు తలల పాములు, బర్రెలు, గొర్రెలు కూడా చూశాం. వాటిలో అత్యధికం ఈ భూమ్మీద పడిన కొన్ని గంటల వరకే బతుకుతుంటాయి. భూమిపైకంటే ఎక్కువ జీవరాశులు ఉన్న సముద్రంలో ఇంకెన్ని రకాల వింత జీవులు ఉంటాయో మనకు తెలీదు. విషయంలోకి వస్తే రెండు తలల షార్క్ చేప పిల్ల మనదేశంలోనే దొరికింది. ఇలాంటివి కనిపించడం అత్యంత అరుదు.
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా సత్పతి గ్రామానికి చెందిన నితిన్ పాటిల్ చేపల వేటకు వెళ్లగా రెండు తలల షార్క్ వలలో పడింది. ఇది అప్పుడప్పుడే పుట్టిన పిల్లగా భావిస్తున్నారు. పాటిల్ దాన్ని మొదట కాస్త వింతగా చూసి కొన్ని ఫొటోలు తీసుకున్నాడు. తర్వాత ‘చిన్నపిల్లే కదా, నీటిలోనే ఉండనీ.. ’ తిరిగి నీటిలో వదిలేశాడు. ఆ ఫోటోలో చూసిన మత్స్యనిపుణులు అది అరుదైందని, చెప్పారు. మనదేశంలో ఇలాంటి రెండు తలకాయల షార్క్ పిల్ల కనిపించడం ఇది మూడోసారి అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ శాస్త్రవేత్త కేవీ అఖిలేశ్ వెల్లడించారు. తొలుత అలాంటి పిల్ల 1964లో గుజరాత్లో, రెండోసారి 1991లో కర్ణాటకలో కనిపించాయని చెప్పారు.