Double pension for lineman at Rajendra nagar in rangareddy District
mictv telugu

రిటైర్డ్ ఉద్యోగికి 8 ఏండ్లుగా డబుల్ ఫించన్.. ప్రభుత్వానికి రూ.50 లక్షలు నష్టం

June 9, 2022


ప్రభుత్వ ఖజానా నుంచి ఓ రిటైర్డ్ ఉద్యోగికి ప్రతినెలా వాస్తవంగా రావాల్సిన దానికంటే రెండింతల పింఛను మంజూరయ్యింది. గత ఎనిమిదేళ్లుగా ఇదే జరుగుతున్నా.. పొరపాటున తన అకౌంట్లో ఎక్కువ డబ్బులు పడుతున్నాయంటూ ఆ ఉద్యోగి సంబంధిత సంస్థకు సమాచారం కూడా ఇవ్వలేదు. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.50 లక్షలు సంస్థకు గండిపడటంతో ఆ సంస్థ భారీగా నష్టపోయింది. . విద్యుత్తు పంపిణీ సంస్థలో జరిగిన ఈ పొరపాటును ఆలస్యంగా గుర్తించిన అధికారులు.. విచారణ చేపట్టి బాధ్యులైన రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రస్తుత జేఏవో బి.శ్రీకాంత్‌ను ఈనెల 3న ఎస్‌ఈ గోపయ్య సస్పెండ్‌ చేశారు.

2014 లో రాజేంద్రనగర్‌ డివిజన్‌ కార్యాలయంలో యూడీసీగా పనిచేసిన బి.శ్రీకాంత్‌ నిర్లక్ష్యం కారణంగా.. అదే ఏడాది రిటైర్‌ అయిన లైన్‌మెన్‌ మహ్మద్‌ హుస్సేన్‌కు వాస్తవంగా రావాల్సిన దానికంటే రెండింతల పింఛను మంజూరయ్యింది. వేతన సవరణ సమయంలో అతను చేసిన చిన్న పొరపాటు ఇంత పని చేసింది. ఈ విషయం తెలిసినా సదరు లైన్‌మెన్‌ అధికారుల దృష్టికి తీసుకురాలేదు. ఇలా గత ఎనిమిదేళ్లుగా రిటైర్‌ లైన్‌మెన్‌కు రెండింతల పింఛన్‌ మంజూరవుతూనే ఉంది. ఎనిమిదేళ్లలో ఏకంగా రూ.49,05,579 లను లైన్‌మెన్‌ అదనపు ప్రయోజనంగా పొందారు.

ఒక రిటైర్డ్‌ లైన్‌మెన్‌కు పెద్ద మొత్తంలో పింఛను ఎందుకు వస్తుందని డిఈకి అనుమానం వచ్చి విచారిస్తే … ఉద్యోగి నిర్లక్ష్యం బయటపడింది. బాధ్యులైన అప్పటి రాజేంద్రనగర్‌ సర్కిల్‌ ప్రస్తుత జేఏవో బి.శ్రీకాంత్‌ను ఈనెల 3న ఎస్‌ఈ గోపయ్య సస్పెండ్‌ చేశారు. దాదాపు రూ.50 లక్షలకు సంబంధించి పింఛనుదారు నుంచి ప్రతినెలా రూ.40 వేల చొప్పున రికవరీ చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు.