కొడుకులపై డౌట్.. బతికుండగానే సమాధులు కట్టుకుని..  - MicTv.in - Telugu News
mictv telugu

కొడుకులపై డౌట్.. బతికుండగానే సమాధులు కట్టుకుని.. 

August 10, 2020

Doubt over sons .. Graves built while alive ...

బతికుండగా ఎవరైనా తమ సమాధులను నిర్మించుకుంటారా.. లేదు కదా? ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు ప్రాణాలతో ఉండగానే జీవ సమాధి అవడం చూశాం. కానీ, ఓ వృద్ధజంట బతికుండగానే తమ సమాధులను నిర్మించుకున్నారు. అంతేకాదు సమాధుల్లో తమ విగ్రహాల్ని కూడా ప్రతిష్టించుకున్నారు. వాళ్లు ఎందుకు అంతపని చేశారు అనేది చాలామందికి అంతుచిక్కని ప్రశ్నలా మారింది? కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లీ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సోపాన్, అంజనీ బాయి దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసినా.. ఉన్న నలుగురు కొడుకుల్లో ఏ ఒక్క కొడుకు అయినా తమను బాగా చూసుకోలేడా అని భావించారు వారు. 

ఈ క్రమంలో అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆస్తులు కూడా పంచి ఇచ్చారు. ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఇంతలో ఆ దంపతులు, కొడుకులను షాక్ ఇస్తూ తమ సమాధులను నిర్మించుకున్నారు. గ్రామ శివారులో రూ.లక్షతో వంద గజాల స్థలాన్ని కొని, ఆ స్థలంలో వేర్వేరుగా రెండు సమాధుల్ని నిర్మించారు. అంతేగాకుండా తమ విగ్రహాలను కూడా ప్రతిష్టించుకున్నారు. గ్రామంలో హనుమాన్ మందిర నిర్మాణం కోసం వచ్చిన కళాకారులతో విగ్రహాలను తయారు చేయించారు. ఇందుకోసం రూ.2.5 లక్షల దాకా ఖర్చు చేశారు. బతికుండగానే ఇలా సమాధుల్ని నిర్మించుకోవడం ఏంటని గ్రామంలో చాలామంది అనుకున్నారు. ఇంట్లో కొడుకులు, కూతుళ్లు అమ్మానాన్నలు చేసిన పని ఏంటని అడిగారు. ఎవరైనా కొడుకులమైన తమను అపార్థం చేసుకోవచ్చని అన్నారు. అందుకు వారు ఎవర్నీ నొప్పించడానికి ఈ పని చేయలేదని.. తమ ఆత్మసంతృప్తి కోసం ఈ పని చేశామని సమాధానం ఇచ్చారు. తమ సమాధుల్ని తాము కోరినట్లుగా తమ కొడుకులు నిర్మిస్తారో లేదో అన్న అనుమానంతోనే తామే ఆ పని చేయించుకున్నామని గ్రామస్తులకు కూడా చెప్పారు. దీంతో అందరూ షాక్ అయ్యారు. కాగా, వారు అలా తమ సమాధులను వారే నిర్మించుకోవడానికి గల కారణాలను వారే వివరించారు. సోపాన్ దంపతులు ఓ రోజు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కాలా గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లారు. అక్కడ ఊరి చివర్లో నిర్మించిన సమాధుల్ని చూసి ఆశ్చర్యపోయారు. అవి వారికి బాగా నచ్చాయి. తాము కూడా ఆ విధంగా సమాధులు నిర్మించుకుంటే ఎలా ఉంటుందని వారు భావించారు. అలా తమ ఆలోచనలకు బతికుండగానే రూపునిచ్చుకున్నామని వెల్లడించారు.