5,8 తరగతుల్లో డిటెన్షన్ విధానానికి కేంద్రం చర్యలు తీస్కొంటోంది. ఇది పూర్తిగా ‘ విద్యాహక్కు ’ చట్టానికి తూట్లు పొడిచే ప్రయత్నమే అని విద్యావేత్తలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నారు. అదే గనక అమల్లోకి వస్తే బాల్య వివాహాలు, బాల కార్మికులు పెరిగే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి.
విద్యా ప్రమాణాల పేరుతో విద్యార్థులను పాఠశాలకు దూరం చేసే విధానాలకు కేంద్ర ప్రభుత్వం స్వీకారం చుడుతున్నది. 5,8 తరగతుల్లో డిటెన్షన్ విధానాన్ని తీసుకురావడానికి ముమ్మర ప్రయత్నాలను చేస్తున్నది. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో విద్యాహక్కు చట్టాన్ని సవరిస్తూ ఈ మేరకు బిల్లు తీసుకురావడానికి పూనుకున్నది. ఇదే జరిగితే బాల్య వివాహాలతో పాటు బాలకార్మికులూ భారీగా పెరిగే అవకాశముందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ సర్కార్ ఈ చట్టానికి తూట్లు
ప్రస్తుతం రాష్ట్రంలో నాన్డిటెన్షన్ విధానం కొనసాగుతోంది. ఒకటో తరగతిలో చేరిన విద్యార్థి, నిరాటంకంగా పదో తరగతి వరకు చదవచ్చు. 1970-71 నుంచి ఈ విధానం (నాన్డిటెన్షన్) కొనసాగుతోంది. గతంలో ఏడో తరగతిలో కామన్ పరీక్షలు, పదో తరగతిలో పబ్లిక్ పరీక్షలు నిర్వహించేవారు. ప్రైవేటు యాజమాన్యాలు పాస్గ్యారంటీ పేరుతో తల్లిదండ్రుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేయడంతో 2005లో ఏడో తరగతిలో కామన్ పరీక్షల విధానాన్ని పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. దీనికి బలాన్నిచ్చే విధంగా 2010లో విద్యాహక్కు చట్టం వచ్చింది. దీనిలోని సెక్షన్ 16 ప్రకారం… ‘బడిలో చేరిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకూ ఏ తరగతిలోనైనా మళ్లీ కొనసాగించరాదు. బడి నుంచి తీసేయరాదు’ అని స్పష్టంగా పేర్కొన్నది. కానీ గతేడాది కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈ చట్టానికి తూట్లు పొడిచే విధంగా డిటెన్షన్ విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించింది.
దీనికి బీజేపీ పాలిత ప్రాంతాల నుంచి మద్దతు లభించింది. అయితే అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం డిటెన్షన్ విధానాన్ని వ్యతిరేకించింది. ప్రస్తుతం 5,8 తరగతుల్లో డిటెన్షన్ విధానం తీసుకొస్తున్నట్టు ఇటీవల కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరిగే పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై బిల్లు పెట్టే అవకాశముందని ప్రకటించారు. ఇదే జరిగితే రాష్ట్రంలో బాలకార్మికులు, బాల్యవివాహాలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కేంద్రంతో ఉన్న సాన్నిహిత్య సంబంధంతో తెలంగాణ ప్రభుత్వం గతంలో చెప్పిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం లేకపోలేదని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బడికి దూరమవుతున్న విద్యార్థులు
తెలంగాణ రాష్ట్రంలో బడికి దూరమవుతున్న విద్యార్థుల సంఖ్య భారీగానే ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే 2015 -16 విద్యా సంవత్సరంలో 36.99శాతం మంది విద్యార్థులు బడికి దూరమయ్యారు. వీరిలో బాలురు 38.18 శాతం, బాలికలు 35.17శాతంగా ఉన్నారు.
ఎస్సీ విద్యా ర్థుల్లో 41.14శాతం డ్రాపౌట్స్ ఉండగా, ఎస్టీల్లో 61.33శాతంగా ఉంది. 2006-07 విద్యాసంవత్సరంలో 8,30,606 మంది విద్యా ర్థులు ఒకటో తరగతిలో చేరగా, వారిలో పదో తరగతి (2015-16 విద్యాసంవత్సరం) చదివిన వాళ్లు కేవలం 5,23,324 మంది విద్యార్థులే. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాల్లో డ్రాపౌట్స్ గతం కంటే పెరిగాయి. ప్రస్తుతం డిటెన్షన్ విధానం అమలైతే రాష్ట్రంలో చదువుకు దూరమయ్యే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నది. వీటికి తోడు బాల్య వివాహాలు కూడా పెరుగుతాయని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. వీటన్నింటి ఫలితం అక్షరాస్యతపై పడనున్నది.
విద్యావిధానానికి గొడ్డలిపెట్టు
డిటెన్షన్ విధానం దేశ విద్యావిధానానికి గొడ్డలి పెట్టు లాంటిది. బడి పిల్లలకు సరైన వసతులు కల్పించకుండా, ఇలాంటి విధానాలు తీసుకురావడం సరికాదు. డిటెన్షన్పై పార్లమెంట్లో చట్టం చేయాలనే ఆలోచన మానుకోవాలి. ఈ విధానాన్ని కేవలం బీజేపీ పాలిత ప్రాంతాల్లో మాత్రమే మద్దతు లభించింది. తక్కువ మార్కులు రావడానికి ప్రభుత్వం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులది బాధ్యత కానీ శిక్ష విద్యార్థులకు వేయొద్దు.
నాగటి నారాయణ, విద్యావేత్త
బాధ్యత నుంచి తప్పుకునేందుకే
విద్యారంగ బాధ్యత నుంచి తప్పుకునేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే డిటెన్షన్ విధానం. విద్యార్థులకు మార్కులు ఎందుకు తక్కువ వస్తున్నాయనేది ఆలోచించకుండా, తక్కువ మార్కులు వచ్చాయనే పేరుతో చదువుకు దూరం చేయాలనే ఆలోచన మంచిది కాదు. ఈ విధానంపై కేంద్రం పునరాలోచించాలి. విద్యాకాశాయీ కరణలో భాగంగానే దీన్ని తీసుకొస్తున్నది.
కోట రమేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి
బాల్య వివాహాలు పెరుగుతాయి
డిటెన్షన్ విధానంతో బాల్యవివాహాలు పెరిగే అవకాశముంది. 220 రోజులు చదివిన విద్యార్థి ఫెయిల్ అయితే కేవలం విద్యార్థులనే బాధ్యులను చేయడం సరికాదు. పాసైతేనే పై తరగతికి పంపిస్తాం..లేకుంటే ఇంటికి పంపిస్తామనడం బాలల హక్కులకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.
అచ్యుతరావు, బాలల హక్కుల సంఘం
ఏది ఏమైనా కేంద్ర సర్కార్ ఈ డిటెన్షన్ విధానం గురించి మరో మారు పునరాలోచించాలి. లేదంటే విద్యార్థుల మీద దాని దుష్ప్రభావం తప్పకుండా పడుతుంది. చదువు వ్యాపారం అయిపోతున్న తరుణంలో పిల్లలను కూడా ఇష్టానుసార విధానాలకు బలి పశువులను చేయటం ఎంత వరకు శ్రేయస్కరం అనే ప్రశ్న ఉదయిస్తోంది ?