కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు.. కేబినెట్ ఆమోదం - MicTv.in - Telugu News
mictv telugu

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారు.. కేబినెట్ ఆమోదం

June 24, 2022

కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ఖరారుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో డాక్టర్ బీ.ఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్చుతూ కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై స్థానికంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం వెలువడుతుంది అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎట్టకేలకు జిల్లా పేరు మార్చుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈనెల 27న అమ్మ ఒడి పథకం నిధుల విడుదల, మరో నాలుగు సంక్షేమ పథకాలకు ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

మరోవైపు కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో అమలాపురంలో ముందుగా భారీగా పోలీసులు మోహరించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా పోలీసుల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అమలాపురంలో 144 సెక్షన్ కొనసాగుతోంది. జిల్లాలో 1300 మంది పోలీసులతో గస్తీ నిర్వహణ కొనసాగుతోంది.అయితే కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టవద్దంటూ అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన విషయం విదితమే.