భారతదేశ 15వ నూతన రాష్ట్రపతిగా ద్రౌపదీ ముర్ము కాసేపటిక్రితమే ఢిల్లిలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్.వి. రమణ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోకసభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఎంపీలు, దౌత్య కార్యాలయాల అధిపతులు, ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ముందుగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో ముర్ము సెంట్రల్ హాలుకు చేరుకున్నారు. అనంతరం జస్టిస్ ఎన్.వి. రమణ రాజ్యాంగంలోని ఆర్టికల్-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21సార్లు గాలిలోకి కాల్పులు జరిపి, నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది.
అనంతర ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ.. ”దేశంలో పేదలు కలలు కనొచ్చు. ఆ స్వప్నాలను సాకారం చేసుకోవచ్చు. అందుకు నేనే ఒక మంచి ఉదాహరణ. అత్యున్నత రాజ్యాంగ పదవికి ఎంపిక చేసినందుకు అందరికి ధన్యవాదాలు. మీ ప్రేమ, ఆప్యాయత, నమ్మకం రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించడానికి నన్ను ప్రోత్సహిస్తాయి. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంలో.. రాష్ట్రపతిగా నేను బాధ్యతలు చేపట్టడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. స్వాతంత్ర్య సమరయోధుల లక్ష్యాల కోసం మనం కృషి చేయాలి. దేశ రక్షణ దళాలకు, పౌరులందరికీ కార్గిల్ విజయ్ దివస్ శుభాకాంక్షలు” అని ఆమె అన్నారు.
ద్రౌపది ముర్ము..1958 జూన్ 20న ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలో జన్మించారు. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలి ఆదివాసీ వ్యక్తిగా ఆమె మరో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. ఈరోజు రాష్ట్రపతి పదవిని చేపట్టబోతున్నా ద్రౌపది ముర్ము అత్యంత పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.