Draupadi Murmu who created history..Pramana on 25th of this month
mictv telugu

చరిత్ర సృష్టించిన ద్రౌపది ముర్ము..ఈనెల 25న ప్రమాణ స్వీకారం

July 22, 2022

భారతదేశ రాజ్యాంగం ప్రకారం అన్ని పదవులకన్నా అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని ఓ మారుమూల గ్రామంలో సంతాల్ ఆదివాసీ తెగలో జన్మించి, తల్లిదండ్రులు ఇచ్చిన పది రూపాయలతో కాలేజీకి వెళ్లి, తన విద్యను పూర్తి చేసుకొని, టీచర్‌గా ఉద్యోగం చేస్తూ, 1997లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, కౌన్సిలర్‌గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్‌గా పదవులను అలకరించి, భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ గిరిజన పుత్రిక అయిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పీఠంపై ఆసీనులు కాబోతున్నారు.

రాష్ట్రపతిగా ఇప్పటివరకూ అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు పిఠాన్ని అధిరోహించారు. కానీ, ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు చరిత్రలో తొలిసారిగా ఈనెల 25న ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మూ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోదీ, ఉపరాష్ట్రపతి, వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నిక ఫలితాల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై గురువారం ఆమె ఘన విజయం సాధించారు. దీంతో దేశంలో ఈ అత్యున్నత పదవిని చేపడుతున్న రెండో మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.

ద్రౌపది ముర్మూ.. 1958 జూన్ 20న ఒడిశాలోని మయూరభంజ్ జిల్లాలో జన్మించారు. స్వతంత్ర భారతదేశంలో పుట్టి, రాష్ట్రపతి స్థానానికి చేరిన తొలి వ్యక్తిగా మరో రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు రాష్ట్రపతులుగా ఉన్నవారంతా 1947కి ముందు పుట్టినవారే. ఇక రాష్ట్రపతి పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కురాలు కూడా ఈమే కావడం విశేషం. ప్రస్తుతం ఆమె వయసు 64 సంవత్సరాలు.

ముర్ము రాజకీయ ప్రస్థానమిది..
1997లో బీజేపీలో చేరారు. రాయ్ రంగపుర్ కౌన్సిలర్, వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పుర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2000-2002లో ఒడిశా రవాణా, వాణిజ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2002-2004లో ఒడిశా పశు సంవర్ధక శాఖ మంత్రిగా ఉన్నారు. 2004: రాయ్ రంగ్ పుర్ ఎమ్మెల్యేగా తిరిగి ఎన్నిక, 2002-2009లో మయూరంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా, 2006-2009లో ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా, 2010లో మయూర భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా, 2013-2015లో మయూరంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలుగా, 2015లో ఝార్ఖండ్ గవర్నర్‌గా, ఇప్పుడు భారతదేశ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.