రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుస్తుంది : మమతా బెనర్జీ - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము గెలుస్తుంది : మమతా బెనర్జీ

July 2, 2022

హైదరాబాదులో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఒకవైపు, విపక్షాల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా పర్యటన మరోవైపు వెరసి భాగ్యనగరంలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరుణంలో యశ్వంత్ సిన్హాను ప్రమోట్ చేసిన టీఎంసీ అధినేత, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతిగా బీజేపీ నిలబెట్టిన అభ్యర్ధి ద్రౌపది ముర్ము గెలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఒక మైనారిటీ కమ్యూనిటీకి చెందిన ఆదివాసీ గిరిజన బిడ్డను నామినేట్ చేస్తున్నారని తెలిసి ఉంటే తాము అభ్యర్ధిని పోటీలో నిలబెట్టేవాళ్లం కాదని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ ఈ విషయంలో ముందుగా తమకు సమాచారం ఇవ్వలేదనీ, చెప్పి ఉంటే రాష్ట్రపతి ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవని వెల్లడించారు. అంతకుముందు ద్రౌపది ముర్ముకు ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు మద్దతివ్వగా తాజాగా జేడీయూ, అకాళీదళ్, వైసీపీలు తమ మద్ధతు ద్రౌపదికేనని స్పష్టం చేశాయి. దీంతో ఆమె గెలుపు ఖాయమైంది. ఈ పరిణామాల ఆధారంగానే మమతా దీదీ తాజా వ్యాఖ్యలు చేశారు. కాగా, రాష్ట్రపతి రేసులో ఉన్న ఇద్దరు అభ్యర్ధులు కూడా బీజేపీకి చెందని మాజీ సభ్యులే కావడం గమనార్హం. యశ్వంత్ సిన్హా కుమారుడు ప్రస్తుత బీజేపీ ఎంపీ.