హైదరాబాద్ ‘రక్షణ’ రెడ్డిని ముగ్గులోకి దించి క్షిపణి డేటా కొట్టేసిన పాకిస్తాన్ నటాషా - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్ ‘రక్షణ’ రెడ్డిని ముగ్గులోకి దించి క్షిపణి డేటా కొట్టేసిన పాకిస్తాన్ నటాషా

June 18, 2022

శత్రు దేశం విసిరిన హనీట్రాప్‌లో హైదరాబాదుకు చెందిన డీఆర్డీవో ఉద్యోగి పడ్డాడు. ప్రేమ పేరుతో వల విసిరిన అమ్మాయి ప్రేమిస్తున్నా, పెళ్లి చేసుకుందామంటూ కీలకమైన క్షిపణి సమాచారాన్ని తస్కరించింది. 2018 నుంచి జరుగుతున్న ఈ తతంగాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించడంతో బట్టబయలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాదులోని డీఆర్డీవో లో మల్లికార్జున్ రెడ్డి (29) అనే వ్యక్తి కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్నాడు. ఈ సంతోషంలో తనకు ఉద్యోగం వచ్చిందంటూ 2018లో ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. తర్వాత కొద్ది రోజులకు నటాషా రావు అనే పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా, మల్లికార్జున్ దానిని యాక్సెప్ట్ చేశాడు. తాను బ్రిటన్ డిఫెన్స్ రంగంలో నడిచే పత్రికలో జాబ్ చేస్తున్నానని, తన తండ్రి భారత వాయుసేనలో పనిచేస్తున్నాడని, తమ స్వస్థలం బెంగళూరు అంటూ వివరాలు పంపింది. దాంతో పూర్తిగా ఆమెను నమ్మిన మల్లికార్జున్ రెడ్డి క్షిపణుల సమాచారం, కొన్ని కీలక ఫోటోలను ఆమెకు పంపాడు. ఈ క్రమంలో మల్లికార్జున్ రెడ్డి బ్యాంకు అకౌంటు వివరాలు కూడా తీసుకుంది. ఇలా 2021 డిసెంబరు వరకు సాగగా, తనకు కావాల్సిన సమాచారం తెలుసుకున్న నటాషా రావు.. తన పేరును సిమ్రాన్ చోప్రాగా ప్రొఫైల్ మార్చుకుంది. దాంతో ఆమెతో చాటింగ్ ఆపేశాడు. ఈ విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ విషయాన్ని రాచకొండ పోలీసులకు చేరవేయడంతో మల్లికార్జున్ రెడ్డిని మీర్‌పేటలో అరెస్ట్ చేశారు. విచారణలో లీకేజీ నిజమని తేలడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.