అత్యవసరమైన పనిపైనో, లేకపోతే విహారయాత్రకో ప్లాన్ చేసుకుని సెలవు పెట్టాక.. ఆఫీసు నుంచి బాస్ ఫోన్ చేసి, పని పురమాయిస్తే ఎలా ఉంటుంది? వీలు కాదని వినయంగా చెప్పినా.. ‘ఆఫీసుకు రానక్కర్లేదు, ఇంట్లోంచే చేసెయ్’ అంటే ఎలా ఉంటుంది? మూడంతా పాడవుతుంది కదా. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా మన దేశానికి చెందిన ఓ కంపెనీ కఠిన నిబంధన అమల్లోకి తీసుకొచ్చింది. సెలవురోజున ఉద్యోగులతో పనిచేయించే బాసులకు లక్ష రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. స్పోర్ట్స్ బెట్టింగ్ ప్లాట్‌ఫారమ్ ‘డ్రీమ్11’ కంపెనీ అమల్లోకి తెచ్చిన రూల్ ఇది.
‘డ్రీమ్11 అన్‌ప్లగ్’ పేరుతో తెచ్చిన ఈ విధానం ప్రకారం.. సెలవులో ఉన్న ఉద్యోగిపై అధికారిగాని, లేకపోతే సహోద్యోగి కాని పని చెప్పకూడదు. పనికి సంబంధించి ఫోన్, ఈమెయిల్, మెసేజ్ చేయకూడదు. చేసిన వారికి రూ. లక్ష జరిమానా పడుతుంది. పని ఒత్తిడి నుంచి విశ్రాంతి, మంచి జీవన ప్రమాణాలు, ఉత్పాదకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ నిబంధన కంపెనీలోని ప్రతి ఉద్యోగి వర్తిస్తుందని డ్రీమ్11 తెలిపింది. డ్రీమ్11 కంపెనీ తన ఉద్యోగుల విషయంలో ఉదారంగా ఉంటుందని పేరు. ఇటీవల ఫేస్ బుక్, ట్విటర్లు తొలగించిన ఉద్యోగులకు ఈ కంపెనీ జాబ్ ఆఫర్ ఇచ్చింది.