DRI conducted searches in the oppo offices
mictv telugu

ఇప్పుడు ఒప్పో వంతు.. రూ. 4390 కోట్ల పన్ను ఎగవేత

July 13, 2022

నిబంధనలను పాటించని చైనా మొబైల్ కంపెనీలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటోంది. పన్ను ఎగవేతకు పాల్పడ్డారని సంస్థలపై వరుస దాడులు చేస్తూ అక్రమార్కుల భరతం పడుతోంది. ఇటీవలే వివో కార్యాలయాల్లో తనిఖీలు చేసి అక్రమాన్ని బయటపెట్టగా, ఇద్దరు డైరెక్టర్లు చైనాకు పారిపోయారు. ఇప్పుడు ఒప్పో వంతు వచ్చింది. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో జరిపిన సోదాల్లో ఈ కంపెనీ రూ. 4390 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించింది. స్మార్ట్ ఫోన్ తయారీలో వినియోగించే వస్తువుల కస్టమ్ సుంకం మినహాయింపులను తప్పుడు మార్గంలో ఉపయోగించుకున్నట్టు తేలింది. దీంతో సదరు లావాదేవీలకు కస్టమ్స్ సుంకం చెల్లించాలని నోటీసులు జారీ చేసింది. దాంతో పాటు జరిమానాకు కూడా సిద్ధమైంది. అటు వివో, వన్ ప్లస్ ఫోన్లపై జర్మనీ నిషేధం విధించింది. నోకియాకు చెందిన టెక్నాలజీని చోరీ చేసి వాడుకున్నారని తేలడంతో అక్కడి కోర్టు పైచర్యకు ఆదేశాలిచ్చింది. కాగా, తాజా ఘటనల నేపథ్యంలో తమ కంపెనీలకు సరైన న్యాయ విచారణ అందేలా చర్యలు తీసుకోవాలని చైనా భారత్‌ను కోరింది. ఆయా దేశాల చట్టాలను గౌరవించాలని తమ కంపెనీలకు ఎప్పుడూ చెప్తామని స్పష్టం చేసింది.