దేశవ్యాప్తంగా సరిహద్దుల్లో సైలెంట్‌గా జరుగుతున్న బంగారం అక్రమ రవాణాపై మహారాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ గోల్డెన్ డాన్ పేరుతో.. దేశవ్యాప్తంగా ఒకేసారి దాడులు చేశారు. సూడాన్‌కి చెందిన ఓ స్మగ్లింగ్ సిండికేట్ జరుపుతున్న స్మగ్లింగ్‌కి చెక్ పెట్టారు. ఇండియా-నేపాల్ సరిహద్దుతోపాటూ.. పాట్నా, పుణె, ముంబైలో ఈ దాడులు జరిగాయి. మొత్తం 101.7 కేజీల బంగారం దొరికింది. దాన్ని సీజ్ చేశారు. ఆ బంగారం విలువ సుమారు రూ.51 కోట్లు ఉంటుందని DRI అధికారులు తెలిపారు.
అక్రమ రవాణాకు సంబంధించి పది మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు భారతీయులు, ఏడుగురు సుడాన్ దేశస్థులు ఉన్నారు. పట్నా, పుణె, ముంబయిలతో పాటు ఇండో-నేపాల్ సరిహద్దులో తనిఖీలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుల నుంచి రూ.1.35 కోట్లు విలువ చేసే దేశ, విదేశీ కరెన్సీని సైతం సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. అక్రమ బంగారాన్ని ఎక్కువ భాగం పేస్ట్ రూపంలో ఇండో-నేపాల్ సరిహద్దు గుండా బిహార్ రాజధాని పట్నాకు తీసుకొచ్చారు. ఆపై రైళ్లు, విమానాల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎక్కువగా ముంబయికి రవాణా అవుతున్నట్లు గుర్తించారు.
ఆదివారం అర్ధరాత్రి ముగ్గురు సుడాన్ దేశస్థులను పట్నా రైల్వే స్టేషన్‌లో ముంబయి రైలు ఎక్కుతున్న సమయంలో పట్టుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. వీరి వద్ద 37.126 కిలోల బంగారం పేస్ట్ లభ్యమైంది. ఫిబ్రవరి 20న .. హైదరాబాద్ నుంచి ముంబైకి బస్సులో వెళుతుండగా సూడాన్‌కు చెందిన ఇద్దరు మహిళలను పూణెలో పట్టుకున్నారు.వారి హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి 5.615 కిలోల స్మగ్లింగ్ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే..సోమవారం నాడు పాట్నా నుండి ముంబైకి ప్రయాణిస్తున్న మహమూద్, హసన్ లను లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషన్ వద్ద అడ్డుకున్నారు. వారి వద్ద నుంచి 38.76 కిలోల బరువున్న బంగారు పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారి తెలిపారు.