నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకొని డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు డీఆర్ఐ అధికారులు. సుమారు రూ.50 కోట్లు విలువ చేసే డ్రగ్స్ పదార్థాలను సీజ్ చేశారు. ఈ కేసులో ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి , రూ.18 లక్షల లావాదేవీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
రేకు షెడ్డులో రూ.50 కోట్ల డ్రగ్స్ తయారీ
డ్రగ్స్ తయారీ చేసేందుకు నగర శివారులోని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలానికి చెందిన చంగిచెర్ల ప్రాంతాన్ని నిందితులు ఎంచుకున్నారు. అక్కడ ఓ రేకు షెడ్డును అద్దెకు తీసుకుని రెండు ప్రయోగాశాలలను నిర్మించారు. అనంతరం మత్తపదార్థాలు తయారీ ప్రారంభించారు. టెక్నాలజీని ఉపయోగించి అప్పటికప్పుడు అమర్చుకోగలిగే పరికరాలను దిగుమతి చేసుకుని కేవలం రెండు రోజుల వ్యవధిలోనే ప్రయోగశాలలను సిద్ధం చేశారు. మెఫిడ్రిన్ డ్రగ్ తయారు చేయడానికి కావలసిన ముడి పదార్థాలను తీసుకువచ్చి పని మొదలు పెట్టేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఈ నెల 21న ఆకస్మికంగా సోదాలు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. అక్కడికక్కడే ఆరుగురిని అరెస్ట్ చేయగా.. ఈ డ్రగ్ మాఫియా వెనకున్న కీలక నిందితుడిని ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతడు నేపాల్‌కు పారిపోతుండగా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఎక్స్పోర్ట్ చేసేందుకు సిద్ధంగా ఉన్న రూ.50 కోట్ల విలువైన 24 కిలోలకు పైగా మెఫిడ్రిన్‌ను, రూ.18 లక్షల లావాదేవీలకు సంబంధించిన పత్రాలు స్వాదీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.