జీఎస్టీ అధికారులు ఓ డ్రైవర్ కు షాక్ ఇచ్చారు. వెయ్యి రెండు వేలు కాదు ఏకంగా రూ. 4 కోట్ల జరిమానా కట్టాలని నోటీసులు పంపించారు. దీంతో ఆ డ్రైవర్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ సంఘటన ఒడిశా రాష్ట్రంలోని రూర్కెలాలో జరిగింది. రాజేంద్ర పల్లై అనే వ్యక్తి వృత్తి రీత్యా డ్రైవర్. కొద్దిరోజుల క్రితం కటక్, జీఎస్టీ ఆఫీసు నుంచి అతడికి నోటీసులు వచ్చాయి.
”రాజేంద్ర.. ఆర్పీ ఎంటర్ ప్రైజెస్ అనే కంపెనీకి యజమాని. ఆ కంపెనీ పేరుతో రూ. 4.31 కోట్ల పన్ను బకాయిలు ఉన్నాయి. అది కూడా నకిలీ కంపెనీ పేరుతో, నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి పన్ను ఎగవేశావు” అని ఆ నోటీసులో ఉంది. దీంతో రాజేంద్ర షాక్ అయ్యాడు. తన పేరు, చిరునామాతో ఎవరో మోసాలకు పాలపడుతున్నారని గ్రహించాడు. దీని గురించి రాజేంద్ర మాట్లాడుతూ.. ‘కొద్దిరోజల క్రితం ఓ వ్యక్తి నాకు 10 వేల రూపాయలు వచ్చే జీతం ఇప్పిస్తానని చెప్పి, నా వద్ద నుంచి ఆధార్ కార్డు తీసుకున్నాడు. దాని ఆధారంగా నా పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు. అధికారులు దీనిపై విచారణ జరపాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపాడు. దీని గురించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు చెప్పుకొచ్చాడు.